దేశంలో రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ప్రతిరోజూ పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రధాని మోదీ కరోనా కట్టడి చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితం కావడంతో పేద, మధ్య తరగతి వర్గాలకు కుటుంబ పోషణ భారంగా మారింది. తాజాగా కేంద్రం కరోనా నేపథ్యంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. 
 
కేంద్రం మూడు నెలల ముందుగానే లబ్ధిదారులకు పెన్షన్ అందజేయనుంది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, వితంతువులకు ప్రయోజనం కలగనుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ దేశంలో దాదాపు మూడు కోట్ల మంది వితంతువులు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు జాతీయ సామాజిక చేయూత పథకం కింద నెలవారీ పింఛన్లు పంపిణీ చేస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులకు భరోసా ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. 
 
ఏప్రిల్ నెలలోనే వీరి బ్యాంకు ఖాతాలలో మూడు నెలల పెన్షన్ ఒకేసారి జమ కానుంది. ప్రస్తుతం కేంద్రం 60 - 79 ఏళ్ల లోపున్న వితంతువులు, దివ్యాంగులకు 300 రూపాయలు, 60 - 79 ఏళ్ల లోపున్న వృద్ధులకు 200 రూపాయలు పింఛన్ అందిస్తోంది. 80 ఏళ్లు పైబడిన దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులకు మాత్రం 500 రూపాయల చొప్పున పెన్షన్ అందుతోంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. 
 
మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 59కు చేరగా ఏపీలో 13కు చేరింది. ప్రతిరోజూ కొత్త కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. విశాఖ, కృష్ణా జిల్లాలలో అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. రాయలసీమలో కరోనా ప్రభావం తక్కువగానే ఉంది. ఇప్పటివరకూ చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో మాత్రమే ఒక కేసు నమోదైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: