కరోనా భయం ఇప్పుడు అంతటా ఆవరిస్తోంది. ఆ భయంతో మనిషి విచక్షణ కోల్పోతున్నాడు. ఆవేశంతో ఆలోచన మరుస్తున్నాడు. కరోనా కట్టడి కోసం తమ గ్రామంలోకి ఎవరూ రాకుండా చాలా గ్రామాల్లో రహదారులు మూసేస్తున్నారు. దారుల్లో బండలు పాతుతున్నారు. ముళ్ల కంచెలు వేస్తున్నారు. అడ్డంకులు పెడుతున్నారు. అయితే ఆలోచన లేకుండా చేసే ఇలాంటి పనులు అనర్థాలకు దారి తీస్తున్నాయి. 

 

దీనిపై సోషల్ మీడియాలో సర్క్యలేట్ అవుతున్న ఈ పోస్టు వైరల్ గా మారుతోంది. ఆ పోస్టులో ఏముందంటే.. 

“ వాన్ని చూసి వీడు, వీన్ని చూసి వాడు వాడేసిండని వీడు, వీడేసిండని వాడు
ఆ ఊరోడేసిండని, ఈ ఊరోడు..ఈ ఊరోడేసిండని, ఆ ఊరోడు ముళ్ల కంపలు, కట్టె మొద్దులు వెయ్యంగనే కరోనా కట్టడైతదా? ఆగండి.. ఆలోచించండి..

 

ముఖ్యమంత్రి మొదలు సామాన్యుడి దాకా స్వీయ నియంత్రణ, స్వీయ నిర్బంధం పాటిస్తే
నీ ఊర్లకు ఎవ్వడొస్తడు. మీ అత్యుత్సాహపు ఉరుకులాట వల్ల  అనవసరంగా ప్రాణాలు పోతున్నయ్.  విలువైన సమయం వృథా అవుతున్నది. 

 

నిన్న మా అమ్మమ్మ తన ఊరుకు సుమారు 70 కిలోమీటర్ల దూరంలో చనిపోయింది.ఆమె పార్థీవదేహాన్ని తీసుకుపోయేందుకు మేము పడ్డ తిప్పలు అనేకం. ఊరూరుకు కట్టెమొద్దులు, ముళ్ల కంపలు అడ్డం. తింపి కొడితే ముప్పై ఇండ్లుండయ్. (అట్లా అని వాళ్లను చిన్నబుస్త లేను) ఇంత అమాయకంగా ఎలా బతుకుతారు? 

 

సరే మా అమ్మమ్మ చనిపోయింది, వదిలేద్దాం...? ఒక అంబులెన్స్ కుయ్ కుయ్ అనుకుంట ఎదురుంగ వస్తున్నది. అంబులెన్స్ పోనీకి రోడ్డుకడ్డం ముళ్లకంపలు, కట్టెమొద్దులు. చనిపోయిన నా అమ్మమ్మను పక్కనవెట్టి, బతికున్న అంబులెన్స్ కోసం పోరాడినం. అప్పుడు గానీ ఆ అంబులెన్స్ ఊరు దాటలేదు. ఆ అంబులెన్స్ లో ఉన్నది నిండు చూలాలు. ప్రసవపు నొప్పులు వస్తే కరీంనగర్లోని దవాఖానకు పోతున్నది. అట్లాని జాగ్రత్తలు తీసుకోవద్దని చెప్పడం లేదు. అతి జాగ్రత్తలు, అనవసరపు అత్యుత్సాహాలు అవసరం లేదు. ఒక్కోసారి ఆలోచించి ముందుసాగండి. 

 

పాపం ఆ తల్లి ఎంత నరకం అనుభవించిందో..దవాఖానకు పోవాలంటే కనీసం ఇంకో పది ముళ్లకంపలను దాటాలె..నిజంగా ఆలోచించండి..

మరింత సమాచారం తెలుసుకోండి: