ఇక భార‌త్‌లో కొవిడ్‌-19 పాజిటివ్ కేసుల సంఖ్య న‌మోదులో వేగం పెరుగనుందా..?  కేంద్ర ప్ర‌భుత్వం, ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న ప‌లు కీల‌క నిర్ణ‌యాలు ఇదే విష‌యాన్ని చెబుతున్నాయా..?  అంటే విశ్లేష‌కులు ఔననే అంటున్నారు. దేశ‌వ్యాప్తంగా ఉన్న పెద్ద‌పెద్ద ద‌వాఖాన‌ల‌ను కొవిడ్‌-19 చికిత్స‌ల‌కు కేటాయిస్తున్నారు. దాదాపుగా అన్ని ఆస్ప‌త్రుల‌ను క‌రోనా వైర‌స్ చికిత్స‌ల‌కే కేటాయిస్తున్నారు. ఈమేర‌కు వేగంగా అవ‌స‌ర‌మైన సామ‌గ్రిని కూడా స‌మ‌కూర్చుతున్నారు. తాజాగా.. భారత సాయుధ దళాల కు చెందిన‌ 28 ఆస్పత్రులను కూడా కొవిడ్‌-19 పేషెంట్ల కోసం కేటాయించారు. ఈ ప‌రిణామాల‌న్నీ కూడా మున్ముందు భారీ సంఖ్య‌లో కొవిడ్‌-19 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యే ప్ర‌మాదాన్ని సూచిస్తున్నాయ‌ని ప‌లువురు విశ్లేష‌కులు చెబుతున్నారు. అంటే.. క‌రోనా వైర‌స్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల్లో వేగం పెరిగితే అందుకు త‌గ్గ‌ట్టే పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతుంద‌న్న అంచ‌నాతో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్త‌మై.. అందుక‌వ‌స‌ర‌మైన చ‌ర్య‌లను చేప‌డుతున్నారు.

 

ఈ నేప‌థ్యంలోనే చివ‌ర‌కు భార‌త సాయుధ ద‌ళాల‌కు చెందిన 28 ఆస్ప‌త్రుల‌ను కూడా కొవిడ్‌-19 చికిత్స‌ల కోసం కేటాయించ‌డం గ‌మ‌నార్హం.  సైన్యం, వైమానిక దళం, నావికాదళానికి చెందిన ఇరవై ఎనిమిది ఆస్పత్రులు కరోనా వైరస్ పేషెంట్ల‌కు చికిత్స అందించ‌నున్నాయని డైరెక్టర్ జనరల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ (డిజిఎఎఫ్ఎంఎస్) లెఫ్టినెంట్ జనరల్ అనూప్ బెనర్జీ తెలిపారు. ఈ 28 ఆస్ప‌త్రుల్లో అందే వైద్య‌సేవ‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వ నియంత్ర‌ణ‌లో నిరంత‌రం డీజీఏఎఫ్ఎంఎస్ ప‌ర్య‌వేక్షించ‌నుంది. అంతేగాకుండా ఈ మూడు ద‌ళాల‌కు చెందిన‌ ఐదు ద‌వాఖాన‌ల్లో కొవిడ్‌-19 నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. వీటిలో ఆర్మీ హాస్పిటల్ రీసెర్చ్ అండ్ రెఫరల్(ఢిల్లీ), కమాండ్ హాస్పిటల్ ఎయిర్ ఫోర్స్( బెంగళూరు), సాయుధ దళాల మెడికల్ కాలేజ్( పూణే), కమాండ్ హాస్పిటల్ (సెంట్రల్ కమాండ్) లక్నో, కమాండ్ హాస్పిటల్ (నార్తర్న్ కమాండ్) ఉధంపూర్లో నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. కాగా, భార‌త్‌లో శ‌నివారం ఉద‌యం నాటికి 834 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 19మంది మృతి చెందిన‌ట్లు అధికారవ‌ర్గాలు వెల్ల‌డించాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: