క‌రోనా క‌ల‌క‌లంతో దేశంలో అన్ని వ్య‌వ‌స్థ‌లు తీవ్రంగా ప్ర‌భావితం అవుతున్నాయి. దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితులు నెలకొనడంతో వివిధ వ‌ర్గాలు నిత్యావ‌స‌రాలు స‌హా దైనందిన కార్య‌క‌లాపాలు ఈ 21 రోజులు ఏ విధంగా పూర్తి చేసుకోవాలో అంటూ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. త‌మ‌కు కావాల్సిన వ‌స్తువులు, సేవ‌ల విష‌యంలో ఆందోళ‌న వ్య‌క్తం చేస్త్తూ ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా అన్నీ బంద్ అని ప్ర‌క‌టించ‌డంతో  బ్యాంక్‌ ఖాతాదారుల్లో ఆందోళన తీవ్రస్థాయికి చేరుకుంది. దీంతో గడిచిన పదిహేను రోజుల్లో బ్యాంకుల నుంచి డ‌బ్బులు డ్రా చేసుకోవ‌డం పెద్ద ఎత్తున పెరిగిపోయింది.

 

కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ వచ్చే నెల మ‌ధ్య‌స్థానికి ఉంటుంద‌ని క్లారిటీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ లాక్‌డౌన్  పొడిగించనున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో డబ్బులకు కొరత ఉంటుందన్న భయాలు ప్ర‌జ‌ల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో ఈ నెల 13తో ముగిసిన తొలి పక్షం రోజుల్లో ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసిన నిధుల్లో రూ.53 వేల కోట్ల నిధులను ఉపసంహరించుకున్నారని రిజర్వు బ్యాంక్‌ తాజాగా విడుదల చేసిన నివేదిక స్ప‌ష్టం చేసింది.  ముందస్తు చర్యల్లో భాగంగా బ్యాంకుల శాఖలు, ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ కష్టమవుతున్నదన్న అంచనాతో అత్యధిక మంది నగదును ఉపసంహరించుకున్నారని విశ్లేషించింది. 

 

కాగా,  రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. భార‌తీయ బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ ఎంతో సుర‌క్షితంగా ఉంద‌ని, ఎవ‌రూ భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేద‌ని అన్నారు. క‌రోనా నేప‌థ్యంలో బ్యాంకులు న‌గ‌డు విత్‌డ్రాపై ప‌రిమితులు విధించ‌వ‌చ్చ‌న్న వ‌దంతులు స‌రికాద‌ని వివ‌ర‌ణ ఇచ్చారు.కోవిడ్ వైర‌స్ సంక్షోభం నేప‌థ్యంలో స్టాక్ మార్కెట్‌లో అన్ని సంస్థ‌ల షేర్ల విలువ ప‌డిపోయింది. అందులో బ్యాంకులు కూడా ఉన్నాయి. దాంతో భ‌య‌ప‌డిన కొన్ని ప్ర‌యివేటు బ్యాంకుల ఖాతాదారులు త‌మ డిపాజిట్ల‌ను వెన‌క్కు తీసుకుంటున్నార‌ని తెలిసింది. సంస్థ షేర్ల విలువ‌కు డిపాజిట్ల‌కు ఎలాంటి సంబంధం ఉండ‌దు అని శ‌క్తికాంత్ దాస్ స్ప‌ష్టం చేశారు. భార‌తీయ బ్యాంకులు సుర‌క్షితంగా, బ‌లంగా ఉన్నాయ‌ని ఆయ‌న స్పష్టం చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: