రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం సీఎం కేసీఆర్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డును మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. రద్దీ లేని రోడ్డులో వాహనాలు అతివేగంగా నడుపుతూ ఉండటంతో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఔటర్ రింగ్ రోడ్డును మూసివేస్తున్నట్లు ప్రభుత్వం నుండి ప్రకటన వెలువడింది. 
 
పోలీసులు నిత్యావసర వస్తువులను తరలించే వాహనాలను మాత్రమే ఔటర్ రింగ్ రోడ్డుపైకి అనుమతి ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఈరోజు గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంతో పాటు వాహనాలు అతి వేగంతో వెళుతున్నాయని ఫిర్యాదులు అందడంతో ఔటర్ రింగ్ రోడ్ ను మూసివేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ అమలులో ఉన్నన్ని రోజులు ఔటర్ రింగ్ రోడ్ మూసివేయనున్నారని తెలుస్తోంది. 
 
మరోవైపు రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతోన్న కేసులు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ 59 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కేసుల సంఖ్య 900 దాటింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడి కోసం ఎన్నో చర్యలు చేపడుతున్నాయి. ఈ చర్యలు కొంతమేరకు సత్ఫలితాలు ఇస్తున్నా పూర్తి స్థాయిలో మాత్రం కరోనా కట్టడి కావట్లేదు, 
 
కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈరోజు కేరళలో తొలి కరోనా మరణం నమోదైంది. కేరళలోని కలంసెరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు దుబాయ్ నుంచి కేరళకు వచ్చినట్లు సమాచారం అందుతోంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేరళ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపొవడంతో రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగితే మరిన్ని సంచలన నిర్ణయాలను అమలు చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: