కరోనా వైరస్ దెబ్బకు మొన్నటి వరకు చికెన్ తినాలంటేనే ప్రజలు భయపడిపోయారు.  కోడిని తింటే కరోనా వస్తుందని భావించి అసలు చికెన్ ను ఎవ్వరూ పట్టించుకోలేదు. అందుకే చికెన్ అంటేనే మాకొద్దు, మేం తినమని తేల్చి చెప్పేసారు. దీనికి తోడు చికెన్, గుడ్లు తింటే కరోనా వస్తుందని సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ప్రచారం జరిగింది. ఇక దీంతో చికెన్, గుడ్డు ధరలు అమాంతం పడిపోయాయి. ఇక కోళ్ళను కొనే వాళ్ళు లేక, వాటిని మేపలేక చాలా మంది పౌల్ట్రీ ఫాం ల యజమానులు వాటిని ఉచితంగా అందరికీ పంచేసారు. కొందరైతే ఏకంగా కోళ్ళను గొయ్యి తీసి బతికుండగానే పూడ్చి పెట్టారు. అందువల్ల పౌల్ట్రీ పరిశ్రమ నష్టాల్లో కూరుకపోయింది. కోట్లలో నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. పలువురు మంత్రులు కూడా చికెన్ ఫెస్టివల్ నిర్వహించి చెప్పినా ప్రజలు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. చికెన్ ధరలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి.

 

 

చికెన్, గుడ్లు, పాలు, పండ్లు ఆరోగ్యానికి ఎంతో అవసరమని.. అవి తినడం ద్వారా కరోనాను ఎదుర్కునే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని సీఎం కేసీఆర్ స్వయంగా తెలిపారు.  ఆయన వ్యాఖ్యలు కూడా చికెన్, గుడ్ల ధరలు పెరగడానికి దోహదం చేశాయని చికెన్ వ్యాపారులు కూడా చెబుతున్నారు. చికెన్, గుడ్లు తింటే బలంగా ఉంటామని, కరోనాను ఎదుర్కోవచ్చని పలువురు చెప్తున్న నేపధ్యంలో గత వారం రూ.80లు పలికిన కిలో చికెన్ ధర, ఇప్పుడు రూ.170లకి పైగా పలుకుతోంది. అయితే దీనికి ప్రధాన కారణం లాక్ డౌన్ మాత్రమే కాకుండా కోళ్ల పెంపకం తగ్గటం కూడా అని పౌల్ట్రీ వ్యాపారులు అంటున్నారు.  ప్రస్తుతం డిమాండ్ పెరగం, సప్లై తగ్గడం వల్ల చికెన్ ధర పెరిగిందని వారు తెలిపారు. మొత్తానికి ఇప్పుడు పౌల్ట్రీ పరిశ్రమ బాగానే కోలుకుంటోంది. కానీ చికెన్ లవర్స్ మాత్రం ఫ్రీగా ఇచ్చినప్పుడు తినకుండా, ఇప్పుడు మళ్ళీ ఎక్కువ ధర పెట్టి కొనుక్కోవాల్సి వస్తుందని వాపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: