జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పి.ఏ.సి.) సభ్యులు, సమన్వయ కమిటీ సభ్యులు, నాయకులతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “మీరు, మీ కుటుంబ సభ్యులు, జన సైనికులు, వారి కుటుంబాలు ఆరోగ్యంగా, క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీరంతా మీ పరిధిలోని జన సైనికుల క్షేమం గురించి తెలుసుకొంటూ ఉండండి.`` అని సూచించారు. 

 

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న క్లిష్ట కాలం ఇదని, ఆందోళనలో ఉన్న ప్రజానీకానికి అండగా నిలవడమే మన ధర్మం అని పవన్ కల్యాణ్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రజారోగ్యం విషయంలో స్పష్టమైన ఆదేశాలిచ్చింది.. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నాయన్నారు. ``మన ప్రాంతం, రాష్ట్రం, దేశానికే కాదు ప్రపంచమంతటికీ ఇది విపత్కరమైన సమయం. మన దగ్గర లాక్ డౌన్ విధించిన క్రమంలో క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై దృష్టి సారించండి. రైతులు, కార్మికులు, పేదలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకోండి. అవి స్థానికంగానో, జిల్లా పరిధిలో పరిష్కారం అయ్యే పక్షంలో అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేలా చూడండి. స్థానికంగా ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం చేపడుతున్న పనులను పరిశీలించండి. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఇవి ఏ విధంగా వ్యయం అవుతున్నాయో దృష్టి పెట్టండి.`` అని ప‌వ‌న్ సూచించారు. ప్రధాన సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిద్దామ‌ని పార్టీ నేత‌ల‌కు ప‌వ‌న్ పిలుపునిచ్చారు. ``మామిడి రైతుల సమస్య నా దృష్టికి వచ్చింది. వెంటనే ఆ రైతుల్లో నెలకొన్న ఆందోళనపై ఆ విషయం గురించి సామాజిక మాధ్యమం ద్వారా ప్రభుత్వానికి తెలియచేశాను. మీ దృష్టికి వచ్చిన ప్రధాన సమస్యలను పార్టీ కార్యాలయానికి నివేదిక ఇవ్వండి. ప్రజల పక్షాన మాట్లాడదాం” అన్నారు. రైతాంగానికి ఎదురవుతున్న ఇబ్బందులు, వైద్య సదుపాయాలు, ఆ సేవల్లో ఉన్న సిబ్బందికి మౌలిక సదుపాయాల కల్పనలో లోపాలు తదితర విషయాలను నాయకులు పార్టీ అధ్యక్షుల దృష్టికి తీసుకువచ్చారు.

 


ఈ సంద‌ర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప‌వ‌న్‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. “కరోనా అన్ని వర్గాలపైనా ప్రభావం చూపిస్తోంది. ఈ తరుణంలో మన అధ్యక్షులవారు రూ.2 కోట్లు విరాళం ఇచ్చినందుకు మనందరం అభినందించాలి. ముఖ్యమంత్రి సహాయ నిధికీ, ప్రధానమంత్రి సహాయ నిధికి ఇవ్వడం వల్ల ఈ సమయంలో నేరుగా నిధులు ఖర్చు చేసే అవకాశం కలుగుతుంది. ప్రభుత్వాలకీ నిధుల కొరత ఉంటుంది. ఇలా సహాయ నిధికి ఇవ్వడం అవసరం అని భావించారు” అని తెలిపారు. ప్రధానమంత్రి సహాయ నిధి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు రూ.2 కోట్ల విరాళం ఇచ్చినందుకు పవన్ కల్యాణ్‌ను నాయకులందరూ అభినందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: