ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా క‌ల‌కలం కొన‌సాగుతోంది. కరోనా వైరస్‌ కారణంగా యూరప్‌ దేశాలు గజగజా వణికిపోతున్నాయి. ముఖ్యంగా ఇటలీ, స్పెయిన్‌, జర్మనీ, యూకే దేశాలు వైరస్‌ దెబ్బకు అతలాకుతలం అయిపోతున్నాయి. రోగులకు వైద్య సదుపాయాలు, మందులు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. మ‌రోవైపు కరోనాకు మూలం అనే ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటూ...అనంత‌రం వ్యాధిని అరిక‌ట్ట‌డంలో చైనా విజయం సాధించింద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో ఆ దేశం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 

 

కరోనా వైరస్ ఉద్భవించిన తర్వాత వూహాన్ నగరాన్ని  చైనా ప్రభుత్వం లాక్‌డౌన్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా వూహాన్ నగరంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.  హుబే ప్రావిన్సులోని వూహాన్ నగరంతో పాటు ఆయా ప్రాంతాల్లో  రవాణా, ప్రయాణికుల సర్వీసులు ప్రారంభమయ్యాయి. రైలు సర్వీసులను పునరుద్దరించిన నేప‌థ్యంలో కోవిడ్‌-19  చికిత్సకు అవసరమైన 166.4 టన్నుల మందులను సాయంగా అందిస్తోంది.  మందులతో ఉన్న  సరకు రవాణా రైలు వుహాన్‌ నుంచి జర్మనీలోని డూయిస్‌బర్గ్‌కు బయలుదేరింది.  ఈ ప్రత్యేక రైలు 15 రోజుల తర్వాత జర్మనీ చేరుకోనుంది. రైలులోని కరోనా వైరస్‌ను నియంత్రించే  మందులను యూరప్‌ దేశాలకు పంపిణీ చేయనున్నారు.

 

ఇదిలాఉండ‌గా, మ‌న‌దేశంలో లాక్‌డౌన్‌ అమలులో ఉండటంతో.. రోజువారి కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఉంటున్న రోజువారి కూలీల్లో మెజార్టీ పొరుగున ఉన్న‌ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారే. ర‌వాణ స‌దుపాయం లేక‌పోవ‌డంతో సొంత గ్రామాలకు కాలినడకన వెళ్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌.. వలస కూలీల రవాణా కోసం 1000 ప్రత్యేక బస్సులను సిద్ధం చేశారు. ఆ బస్సుల్లో కూలీలను స్వస్థలాలకు తీసుకెళ్లాలని ఆదేశించారు సీఎం యోగి. ఢిల్లీ - యూపీ సరిహద్దులోని ఘజియాపూర్‌కు వందల సంఖ్యలో కూలీలు చేరుకున్నారు. పోలీసులు వారిని అక్కడే అడ్డుకుని ప్రత్యేక బస్సుల్లో పంపిస్తున్నారు. యూపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం ప‌ట్ల కూలీలు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: