లాక్‌డౌన్‌ నేపథ్యంలో హైద‌రాబాద్ వాసుల‌కు ప‌లు ర‌కాల స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్న సంగ‌తి తెలిసిందే. న‌గ‌రంలోని వారికి ఏ ఇబ్బందులూ తలెత్తకుండా మార్కెటింగ్‌ శాఖ చర్యలు చేపట్టింది. సంచార వాహనాలను వీధుల్లోకి పంపి రైతు బజారు ధరలకే కూరగాయలను అమ్మే ఏర్పాట్లు చేసింది. గురువారం నుంచే ఆ విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఉన్న 12 సంచార విక్రయ కేంద్రాల సంఖ్యను 79కి పెంచింది. వీటి సహకారంతో నగర వ్యాప్తంగా ఎక్కడ కావాలంటే అక్కడ కూరగాయలు అందుబాటులో ఉంచనుంది. దీంతోపాటుగా ప్రజలంరికీ అందుబాటులో నిత్యావసర సరుకులు ఉండేలా పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. దీంతో నగరంలో నిరాటంకంగా నిత్యావసర వస్తువులు సరఫరా అవుతున్నాయి.

 


నిత్యావసరాల సరఫరాకు ఇబ్బందులు ఏర్పడకుండా, ఆయా వస్తువులతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు జాయింట్‌ సీపీ అవినాష్‌ మహంతి నేతృత్వంలో స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. దాంతో పాటు తాజాగా శుక్రవారం నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎక్కడ కూడా ఇబ్బందులు ఏర్పడకుండా, ఎవరికైనా సమస్య వస్తే వెంటనే పోలీసులను సంప్రదించేందుకు హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. 24/7 హెల్ప్‌లైన్‌ పనిచేస్తుందని సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. ఎవరైనా నిత్యావసర వస్తువుల సరఫరాలో ఇబ్బందులు ఎదుర్కొంటే వెంటనే హెల్ప్‌లైన్‌ నంబర్‌ 040-23434343కు ఫోన్‌ చేయాలని సూచించారు.

 

కూకట్‌పల్లి రైతుబజార్‌ ఆధ్వర్యంలో 6 ప్రాంతాలలో సంచార రైతుబజార్‌లను ఏర్పాటు చేసి కూరగాయలను విక్రయించారు. కూరగాయల విక్రయదారులకు చెందిన వాహనాల్లోనే సంచార రైతుబజార్లు నిర్వహించుకునేందుకు మార్కెటింగ్‌శాఖ అధికారులు వెసులుబాటు కల్పించారు. వాహనాలు అందుబాటులో లేని వారికి ప్రభుత్వం తరపున వాటిని ఏర్పాటు చేసి వీధుల్లో కూరగాయలు విక్రయించనుంది. అయితే వాహన నిర్వహణ ఖర్చుల కోసం కిలో కూరగాయలకు 2 చొప్పున అధికంగా వినియోగదారుల నుంచి వసూలు చేయనున్నారు. కాగా కరోనా వ్యాప్తి చెందకుండా వినియోగదారులు ఒకేసారి గుమిగూడకుండా పాటించాల్సిన పద్ధతులపై కూడా పోస్టర్ల ద్వారా అవగాహన కల్పించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: