తెలంగాణ రాష్ట్రంలో నిన్న కరోనా లక్షణాలతో ఒక వృద్ధుడు మరణించిన విషయం తెలిసిందే. మరోవైపు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో మొన్న 14 పాజిటివ్ కేసులు నమోదు కాగా నిన్న ఒక్కరోజే 8 కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల సంఖ్య పెరగడం, తొలి మరణం నమోదు కావడంతో సీఎం కేసీఆర్ మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారని సమాచారం. 
 
రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని సీఎం అధికారులకు, పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రజలను చైతన్యవంతం చేసేందుకు కార్యాచరణ చేపట్టబోతున్నారని సమాచారం. ఈ విషయాల గురించి చర్చించడానికి ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ ప్రగతిభవన్ లో అత్యవసర, అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశం అనంతరం అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తారు. 
 
ఈరోజు సాయంత్రం సీఎం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరిన్ని సంచలన నిర్ణయాలు రాష్ట్రంలో అమలు చేయనున్నట్లు ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ కరోనా లక్షణాలతో మరణించిన వృద్ధుడికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకున్నారు. సీఎం లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నా కొన్నిచోట్ల జనం గుంపులు గుంపులుగా జమ కావడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 
 
సీఎం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వదంతుల గురించి కూడా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఈరోజు జరగబోయే అత్యున్నత స్థాయి సమావేశంలో కరోనా పాజిటివ్ కేసులు, కరోనా అనుమానితుల చికిత్సలు, విశ్రాంత వైద్యులు, మందుల లభ్యత గురించి చర్చించనున్నారని సమాచారం. నిత్యావసర వస్తువులు, రేషన్ బియ్యం, నగదు సరఫరా, ఇతర అంశాల గురించి చర్చించనున్నారని సమాచారం. మరోవైపు రాష్ట్రంలో ప్రతిరోజు భారీగా కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: