తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 67కు పెరిగిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటించడంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్ డౌన్ వల్ల వేతనాలు రావని తెలంగాణ ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఉద్యోగులను దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉద్యోగులందరికీ శుభవార్త చెప్పారు. 
 
ప్రభుత్వం రాష్ట్రంలో లాక్ డౌన్ రోజులను పెయిడ్ హాలిడేస్ గా ప్రకటన చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీఎం కేసీఆర్ మొదట మార్చి 31వ తేదీ వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుందని ప్రకటించారు. రెండు రోజుల క్రితం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏప్రిల్ 15 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
రాష్ట్రంలో 25,000 మంది క్వారంటైన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో నిన్న తొలి కరోనా మరణం నమోదైంది. రాష్ట్రంలో రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో సీఎం కేసీఆర్ ఈరోజు అధికారులతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈరోజు సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసీఆర్ కరోనా గురించి మాట్లాడబోతున్నారని తెలుస్తోంది. 
 
రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నా రాష్ట్రంలో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టినా కృషికి తగిన ఫలితం రావట్లేదు. దీంతో మరింత కఠినంగా లాక్ డౌన్ నిబంధనలను అమలు చేయాలని... కొన్ని ప్రాంతాలలో ఈ నిబంధనలు సరిగ్గా అమలు కావడం లేదని సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రజల్లో రోజురోజుకు అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు నెలకొనడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: