ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో ఆరు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నిన్న గుంటూరు జిల్లాలో రెండు, ప్రకాశం జిల్లాలో రెండు, కృష్ణా, కర్నూలు జిల్లాలలో ఒక్కో కేసు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే సిద్ధమైంది. 
 
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల గడువును మరో నెలరోజులపాటు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 30 వరకు గడువు పెంచడంతో పాటు జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వ శాఖలు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలని ఆదేశాలిచ్చింది. 
 
రాష్ట్రంలో కరోనా వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. మరోవైపు నిన్న ఒక్కరోజే ఆరు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. రాష్ట్రంలో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా గురించి ప్రజల్లో మరింత అవగాహన పెంచి ప్రజలను అప్రమత్తం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. 
 
రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడానికి ప్రభుత్వం ఆశా వర్కర్లు, హెల్త్ అసిస్టెంట్లు, గ్రామ... వార్డ్ వాలంటీర్ల సేవలను వినియోగించుకుంటోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో కరోనా ప్రభావం తక్కువగానే ఉన్నా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం కేసుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉంది. ప్రభుత్వం రాష్ట్రంలో సర్వేల ద్వారా సమాచారం తెలుసుకుంటూ కొత్త కేసులు నమోదు కాకుండా తగిన చర్యలు తీసుకుంటోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: