కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. చిన్నా, పెద్ద‌, పల్లె ప‌ట్నం అనే తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రూ వ‌ణికిపోతున్నారు. ఆప‌ద‌లో స‌హాయం చేసే వారి కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో హిందువుల ఆరాధ్య దైవ‌మైన తిరుమ‌ల వెంక‌టేశ్వ‌రుడి నిల‌యానికి చెందిన‌ అధికారులు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. టీటీడీ ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్  తాజాగా విలేకరులతో మాట్లాడుతూ కీల‌క నిర్ణ‌యాలు వెల్ల‌డించారు. కరోనా కోవిడ్‌-19 నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ కారణంగా కొంత మంది ఆహారం దొరక్క ఇబ్బందులు పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందని, టీటీడీ బోర్డు చైర్మెన్‌ వైవి.సుబ్బారెడ్డి సూచనల మేరకు ఎస్వి అన్నప్రసాదం ట్రస్టు ద్వారా శనివారం నుంచి తిరుపతిలో ఆహార పొట్లాల పంపిణీని ప్రారంభించామని తెలిపారు. అవసరమైతే ఒక పూటకు 50 వేల ఆహార పొట్లాలు తయారు చేసి పంపిణీ చేసేందుకు టీటీడీ సిద్ధంగా ఉందని వివరించారు.  త‌ద్వారా తిరుమ‌ల వెంక‌న్న సేవ‌లు అన్ని వ‌ర్గాల ప్ర‌యోజ‌నాల‌కు అందుతాయ‌ని ఈఓ ప్ర‌క‌టించారు. 

 

టీటీడీ బోర్డు చైర్మెన్‌ వైవి.సుబ్బారెడ్డి ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశాల మేరకు తిరుపతి జేఈఓ బసంత్‌కుమార్‌ పర్యవేక్షణలో తొలిరోజు శనివారం 15 వేల పులిహోరా పొట్లాలను టీటీడీ అన్నప్రసాదం విభాగం ఆధ్వర్యంలో సిద్దం చేశారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం వద్ద గల క్యాంటీన్‌లో ఈ మేరకు ఆహార పొట్లాలను రెవెన్యూ, తుడా, మున్సిపల్‌ కార్పోరేషన్‌ అధికారులకు అందచేశారు. కాగా పొంగల్‌, పెరుగన్నం, టమాటా రైస్‌, బిస్మిల్లాబాత్‌, కిచిడి తదితరాలతో కూడిన మెనూను రోజుకు ఒకటి చొప్పున తయారు చేస్తారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 30 వేల పొట్లాలు, రాత్రి 15 వేల పొట్లాలను తయారు చేసేందుకు టీటీడీ అధికారులు ప్రణాళిక రూపొందించారు. రెవెన్యూ, తుడా, మున్సిపల్‌ కార్పోరేషన్‌ అధికారులు తమ సిబ్బంది సాయంతో తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, రెండవ సత్రం, తిరుచానూరులోని శ్రీపద్మావతి నిలయం వద్ద ఆహార పొట్లాలను అవసరమైన వారికి అందిస్తారు.

 

 

దీంతో పాటుగా క‌లియుగ దైవం యొక్క ఆస్తుల‌ను సైతం ప్ర‌జ‌ల సంక్షేమం కోసం వినియోగించిన‌నున్న‌ట్లు ఈఓ ప్ర‌క‌టించారు. రాయలసీమ జిల్లాల నుంచి కరోనా అనుమానిత కేసులు ఎక్కువగా తిరుపతిలోని స్విమ్స్‌ ఆసుపత్రికి వస్తున్నాయని, అవసరమైతే బర్డ్‌ ఆసుపత్రిని కూడా వ్యాది గ్రస్తులకు చికిత్స అందించేందుకు, క్వారంటైన్‌గా వినియోగించేందుకు అనుమతి ఇచ్చామని ఈఓ వెల్లడించారు. ఇప్పటికే తిరుపతిలోని రుయా ఆసుపత్రితో పాటు స్విమ్స్‌, పద్మావతి వైద్య కళాశాలలో కరోనా వ్యాది అనుమానితుల కోసం తగిన ఏర్పాట్లు చేశారని, తిరుచానూరులోని శ్రీపద్మావతి నిలయం వసతి సముదాయాన్ని క్వారంటైన్‌ కేంద్రంగా వినియోగిస్తున్నారని తెలియజేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో వెంటిలేటర్ల కొరత ఉందని తెలుస్తోందని, స్విమ్స్‌లో ప్రస్తుతం ఉన్న వెంటిలేటర్లు, ఇంకా ఎన్ని అవసరమౌతాయి అనే అంశం పై జిల్లా కలెక్టర్‌ శనివారం ఉదయం సమీక్షించారని, అవసరమైన వెంటిలేటర్లను కొనుగోలు చేసేందుకు సాయం చేస్తామని ఈఓ తెలిపారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వ్యాది వ్యాప్తిని అరికట్టేందుకు టీటీడీ తరపున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని టీటీడీ ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. తిరుమలలోని ధర్మగిరి వేదవిజ్ఞాన పీఠంలో మూడు రోజుల పాటు జరిగిన శ్రీశ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం శనివారం మహాపూర్ణాహుతితో ముగిసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ ఈఓ కరోనా వ్యాది వ్యాప్తిని నివారించేందుకు చేపడుతున్న చర్యలను తెలియజేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: