తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దినోత్స‌వం సంద‌ర్భంగా క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి నేప‌థ్యంలో టీడీపీ పెద్ద‌లు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఎవ‌రింట్లో వారు ఉంటూనే పార్టీ ఆవిర్భావ వేడుక‌లు జ‌ర‌పాలని ఆదేశించారు. కాగా, వేడుక‌ల్లో పాల్గొన్న అనంత‌రం టీడీపీ అద్య‌క్షుడు చంద్ర‌బాబు పార్టీ నేత‌ల‌తో టెలీ కాన్ఫ‌రెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ``టీడీపీ కార్యకర్తలందరికీ శుభాభినందనలు. ప్రపంచాన్నే వణికిస్తోన్న మహమ్మారిగా కరోనా మారింది. అందుకే ఈ రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఇళ్లలోనే చేసుకుంటున్నాం.  పేదవాడి గుడిసె, రైతుల నాగలి, కార్మికుల చక్రం టిడిపి జెండాలో పొందుపరిచారు. సామాన్యుడి వాహనం సైకిల్ ను ఎన్నికల గుర్తుగా పెట్టారు. స్థాపించిన 9నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ టిడిపి. 13వ లోక్ సభలో 35మంది ఎంపిలతో కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ప్రజల్లోనుంచి నాయకులను ఎన్టీఆర్ తయారు చేశారు. రాజకీయాల్లో నూతన సంస్కృతికి శ్రీకారం చుట్టారు. విద్యాధికులతోనే రాజకీయాల్లో మార్పు సాధ్యమని నమ్మారు. 125మంది గ్రాడ్యుయేట్లకు, 28మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లకు, 20మంది డాక్టర్లకు, 8మంది ఇంజనీర్లకు, 47మంది లాయర్లకు సీట్లు ఇచ్చి ఎన్నికల్లో పోటీలో నిలిపారు. బిసి,ఎస్సీ,ఎస్టీ, ముస్లిం మైనారిటిలకు రాజ్యాధికారం కల్పించారు. 38ఏళ్లుగా బీసిలే తెలుగుదేశం పార్టీకి వెన్నెముక.`` అని చెప్పుకొచ్చారు.

 

``ఎన్టీఆర్ రూ 2కే కిలో బియ్యం ఆహార భద్రతకు శ్రీకారం చుట్టింది. అన్నదానం వాడవాడలా అన్నా కేంటిన్ల ఏర్పాటుకు నాంది అయ్యింది. ఎన్టీఆర్ పక్కా ఇళ్ల నిర్మాణం దేశవ్యాప్తంగా అందరికీ ఇళ్లు పథకానికి మార్గదర్శకం అయ్యింది. కష్టాలలో, నష్టాలలో పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు పాదాభివందనాలు. హత్యలకు గురైనా, ఆస్తులు కోల్పోయినా వెనుకడుగు వేయకుండా పార్టీ కోసం చేసిన త్యాగాలు మరువలేము. కొందరు నాయకులు పార్టీ వీడిపోయినా, పసుపు జెండా మోస్తున్న కార్యకర్తల రుణం తీర్చుకోలేం. ఫ్యాక్షనిజానికి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేసిన పార్టీ టిడిపి. సైబరాబాద్ నిర్మాణం, అవుటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు, ఐటి రంగం అభివృద్ది చేశాం. ఏపిలో 5ఏళ్లలో లక్షల కోట్లతో అభివృద్ది-సంక్షేమం చేశాం. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 72% పూర్తి చేశాం. 22నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేశాం. `` అని చంద్ర‌బాబు సెల‌విచ్చారు.

 

``గత 11నెలలుగా ఆయా పనులన్నీ ఆపేశారు. రాష్ట్రాన్ని అంధకారంలో ముంచారు. ఉపాధి అవకాశాలను దెబ్బతీశారు. పెట్టుబడులన్నీ తరిమేశారు. టిడిపి కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులతో వేధిస్తున్నారు. అయినా భయపడకుండా పార్టీకి వెన్నంటి నిలబడ్డారు. ప్రజాహితం కోసం పాటుబడిన పార్టీ తెలుగుదేశం. తూర్పుగోదావరి తుఫాన్ లో, కర్నూలు కృష్ణా వరదల్లో, ఉత్తరాఖండ్ వరదల్లో, సింగరేణి గనుల్లో ఘోర ప్రమాదంలో, హుసేన్ సాగర్ వరదల్లో, హుద్ హుద్ బీభత్సంలో, తిత్లి తుఫాన్ లో, అనేక విపత్తుల్లో బాధితులకు టిడిపి కార్యకర్తలు నాయకులు ముందుండి సేవలు అందించారు. ఇప్పుడీ కరోనా మహమ్మారి విపత్తులో కూడా ప్రజల్లో ధైర్యం నింపాల్సిన బాధ్యత మనదే. అన్నివర్గాల ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంచాలి. కరోనా మహమ్మారికి రాజు పేద భేదం లేదు. ప్రిన్స్ ఛార్లెస్ నుంచి సామాన్యుడి దాకా అందరికీ శరవేగంగా విస్తరిస్తోంది. చికిత్స తర్వాత 19రోజులకు మళ్లీ పాజిటివ్ వచ్చే ప్రమాదం ఉంది. రోజుకు లక్ష మందికి పైగా కరోనా సోకుతోంది. ఒక రోగి నుంచి 6రోజుల్లో 3200మందికి విస్తరించే ప్రమాదం ఉంది. బహుళ నిష్పత్తిలో 2రోజుకు 200 మందికి, 3వరోజుకు 400, 4వరోజు 800, 5వరోజు 1,600, ఆరవరోజు 3,200మందికి బహుళ నిష్పత్తిలో విస్తరిస్తుందని వుహాన్ గవర్నర్ హెచ్చరించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎంతో  జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించాలి. భౌతిక దూరం పాటించాలి, టచ్ పాయింట్స్ తగ్గించాలి. అన్నివర్గాల ప్రజల్లో అవగాహన పెంచాలని’’ అని చంద్రబాబు కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: