గత ఐదేళ్లు ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబు...23 మంది వైసీపీ ఎమ్మెల్యేలని టీడీపీలోకి లాగేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఎమ్మెల్యేలతో పాటు అనేక మంది వైసీపీ నేతలని పార్టీలోకి తీసుకున్నారు. అయితే ఇలా తీసుకోవడం ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవలు చేస్తున్న టీడీపీ నేతలకు నచ్చలేదు. పైగా వారిని తీసుకోవడం వల్ల టీడీపీకి ఏమన్నా లాభం జరిగిందా? అంటే అస్సలు లేదు. కొత్తగా వైసీపీ నేతలు రావడం వల్ల చాలా నియోజకవర్గాల్లో టీడీపీలో ఆధిపత్య పోరు నడిచింది.

 

చివరికి ఈ వలసలని ప్రజలు కూడా అంగీకరించలేదు. చంద్రబాబు వైసీపీ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలని తీసుకున్నారో అదే 23 మంది ఎమ్మెల్యేలని  2019 ఎన్నికల్లో ఇచ్చారు. అయితే ఫలితాలు విషయం పక్కనబెడితే చంద్రబాబు వైసీపీ నేతలని తీసుకునేప్పుడు చాలామంది టీడీపీ నేతలు వలసలని వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకించిన వారిలో టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరీ కూడా ఉన్నారు.

 

ఇదే విషయాన్ని తాజాగా ఓ యూ ట్యూబ్ ఛానల్ తో మాట్లాడిన బుచ్చయ్య చెప్పారు. పూర్తిగా ఆయారాం గయారాంల వల్ల పార్టీకి డ్యామేజ్ పెరుగుతుందని, అలాగే నియోజకవర్గాల్లో పాతటీడీపీ కేడర్ కు కూడా అన్యాయం జరుగుతుందని, ఇది పార్టీకి అంతమంచిది కాదని తాను చంద్రబాబుతో చెప్పినట్లు చెప్పారు. కానీ బాబు అవేమి పట్టించుకోకుండా వలసలని ప్రోత్సహించారని, ఫలితంగా ఘోరమైన ఫలితాలు వచ్చాయని అన్నారు.

 

అయితే బుచ్చయ్య వలసలు వద్దు అన్నందుకు బాబు, ఆయనతో రెండేళ్ల పాటు మాట్లాడలేదంట. పైగా తన రాజమండ్రి రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించలేదని మొహమాటం లేకుండా చెప్పేసారు. ఏదో ప్రభుత్వ పథకాలు, ఇంకా కొన్ని గ్రాంట్ల ద్వారా అభివృద్ధి చేసుకున్నానని చెప్పారు.

 

ఇక 2014 ఎన్నికల సమయంలో సుజనా చౌదరీ తన సొంత నియోజకవర్గమైన రాజమండ్రి సిటీ  సీటుని కావాలనే బీజేపీకి కేటాయించి, తనని రూరల్ కు పంపించారని చెప్పుకొచ్చారు. మొత్తానికైతే బాబు.. బుచ్చయ్యనే ముప్పుతిప్పలు పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: