ప్రపంచదేశాలను వణికించేస్తున్న కొరోనా వైరస్ మనదేశానికి మేళ్ళు కూడా చేసింది. వైరస్ వల్ల ప్రపంచదేశాలతో పాటు మనదేశంలోని జనాలు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న విషయం అందరూ చూస్తున్నదే.  ఒక్కసారిగా ఎవరిళ్ళకు వాళ్ళు పరిమితమైపోవటం, ఎక్కడి పనులు అక్కడే దాదాపు నిలిచిపోవటం, పరిశ్రమలు, కంపెనీలు, కార్యాలయాలు కూడా దాదాపు స్తంబించిపోయినట్లే అనుకోవాలి. అన్నీ రంగాల్లో దేశం ఫ్రీజ్ అయిపోవటం దేశ భవిష్యత్తుపై చాలా ప్రభావాన్నే చూపుతుందనటంలో సందేహం లేదు.

 

అయితే ఇదే సమయంలో రెండు మూడు మేళ్ళు కూడా చేసింది కొరోనా వైరస్. అవేమిటంటే 24 గంటలూ ఉరుకులు పరుగుల మీదుండే చాలామంది గత్యంతరం లేక గడచిన వారం రోజులుగా ఇళ్ళకే పరిమితమైపోయి కుటుంబసభ్యులతో గడుపుతున్నారు. పై స్ధాయిలో పనిచేస్తున్న వాళ్ళందరూ తమ కుటుంబసభ్యులతో గడపటం మొన్నటి వరకూ గగనమైపోయిన విషయం చాలామందికి అనుభవంలోకి వచ్చిందే.

 

ఇక రెండో ప్రధానమైన మేలు ఏమిటంటే వాతావరణ కాలుష్యం తగ్గటం. ఓ అధ్యయనం ప్రకరం దేశంలోని 91 నగరాలు, పట్టణాల్లో వాతావరణ పొల్యూషన్ తగ్గటాన్ని కేంద్రప్రభుత్వం గుర్తించింది. ప్రధానంగా ఢిల్లీ, ముంబాయ్, చండీఘడ్, బెంగుళూరు, కోయంబత్తూరు, సేలం, సూరత్, కోల్ కత్తా లాంటి అనేక ముఖ్యమైర నగరాల్లో వాతావరణ కాలుష్యం సుమారు 30 శాతం తగ్గినట్లు అధ్యయనాల్లో తేలింది. మనదేశంలో వాతావరణ కాలుష్యం ఎంతగా పెరిగిపోయిందో చెప్పటానికి ఢిల్లీకి మించిన ఉదాహరణ లేదనే చెప్పాలి.

 

పరిశ్రమలు మూతపడటం, కంపెనీలను మూసేయటం, కోట్లాది మంది ఉద్యోగులు గడచిన వారం  రోజులుగా ఎవరిళ్ళల్లో వాళ్ళు ఉండిపోవటంతో వాతావరణ కాలుష్యం బాగా తగ్గిందని కేంద్రప్రభుత్వం అధ్యయన సంస్ధలు తేల్చిచెప్పాయి. వాహనాలు తిరగకపోవటంతో గాలిలోని డస్ట్ పార్టికల్స్, నైట్రోజన్ ఆక్సైడ్ శాతం గణనీయంగా తగ్గిపోయిందట. దీనివల్ల గాలిలోని  శుభ్రత పెరిగింది. దీనివల్ల ఎప్పుడూ దుమ్ము కొట్టుకుపోయిన ఆకాశాన్ని మాత్రమే చూస్తున్న జనాలు ఇపుడు స్వచ్చమైన ఆకాశాన్ని కూడా చూడగలుగుతున్నారు. మొత్తానికి కొరోనా వైరస్ వల్ల నష్టాలే కాదు లాభాలు కూడా ఉందన్నమాట.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: