తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌త కొద్దికాలంగా క‌రోనా వ్యాధిపై సీరియ‌స్‌గా స్పందిస్తున్న సంగ‌తి తెలిసిందే. వీలైన‌న్ని రివ్యూలు చేయ‌డం, ప్ర‌జ‌ల‌కు సూచ‌న‌లు ఇవ్వ‌డం, అధికారుల‌కు త‌గు ఆదేశాలు ఇవ్వ‌డం వంటివి త‌న‌దైన శైలిలో కొన‌సాగిస్తున్నారు. లాక్‌డౌన్ విష‌యంలో ప‌క్కాగా అమ‌లు చేస్తున్నారు. మ‌రోవైపు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ సైతం ఇదే రీతిలో త‌న మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రుల‌కు సూచ‌న‌లు చేస్తున్నారు. తాజాగా ఆయ‌న మ‌న్‌కీబాత్‌లో ప్ర‌సంగిస్తూ ప్ర‌జ‌ల‌కు ప‌లు సూచ‌న‌లు సైతం చేశారు. అయితే, కేసీఆర్ నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది.

 


క‌రోనా ప‌రిస్థితుల‌పై స‌మీక్షించిన సీఎం కేసీఆర్ అనంత‌రం నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ, గాంధీలో చికిత్స పొందుతున్న కొవిడ్‌-19 పాజిటివ్‌ రోగుల్లో 11 మందికి పూర్తిగా నయమైందని.. వారు సోమవారం డిశ్చార్జి అవుతారని చెప్పారు. వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తీవ్రంగా కష్టపడుతున్నారని కొనియాడారు. కరోనాపై దుర్మార్గపు ప్రచారాలు చేస్తున్నవారిపై కఠినాతి కఠినంగా చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. ``లాక్‌డౌన్‌ ప్రకటించి భారతదేశం వాళ్లు కొంత తెలివిగల్ల పనిచేశారని అంతర్జాతీయ మ్యాగజైన్లలో మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే మనది పేదదేశం. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోంది. ఉండాల్సినంత బలంగా వైద్యవసతులు లేవు. అయినా వ్యాధి వ్యా ప్తి నియంత్రణకు లాక్‌డౌన్‌ చేయడమే ఆయుధం.`` అని వివ‌రించారు. ఈ సంద‌ర్బంగా ఓ విలేక‌రి అడిగిన ప్ర‌శ్న‌పై కేసీఆర్ చిర్రుబుర్రులాడారు.  

 

తెలంగాణ ప్ర‌భుత్వం పేద‌ల‌కు 12కిలోల బియ్యం అందించ‌నున్న‌ట్లు ప్రకటించింది..అయితే,కేంద్రం ఈ స్థాయిలో ప్ర‌క‌టించ‌లేదు కాబ‌ట్టి కేంద్రం తక్కువ అనుకోవాలా? అంటూ స‌ద‌రు విలేక‌రి వేసిన ప్ర‌శ్న‌పై కేసీఆర్ భ‌గ్గుమ‌న్నారు. కేంద్రం కొంత తక్కువ ప్రకటించినంత మాత్రాన వారేం తక్కువ కాదన్నారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవుపలికారు. ఇలాంటి శవాల మీద పేలాలు ఏరుకునుడు వద్దని సూచించారు. ``రాహుల్ ఈ ఎక్స్‌ట్రాలు ఎందుకు? ఎక్స్‌ట్రా అడిగితే మేం కూడా ఎక్స్ ట్రాగా  ఆన్సర్ చెబుతాం. సారీ...చిల్లర రాజకీయాలు వద్దు...శవాల మీద పేలాలు ఏరుకునేది వద్దు`` అంటూ మండిప‌డ్డారు. అయితే, ప్ర‌శ్న‌లు అడిగితే ఇలా మండిప‌డుతున్న నేప‌థ్యంలో విలేక‌రుల స‌మావేశం జ‌రుగుతోందా... ప్ర‌ధాని మోదీలాగా మ‌న్‌కీ బాత్ జ‌రుగుతోందా అర్థం కావ‌డం లేద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: