దేశంలో ఇపుడు అందరికీ ఒక పెద్ద డౌట్ ఉంది. ఏప్రిల్ 14 వరకూ ఉన్న లాక్ డౌన్ డేట్ ని పొడిగిస్తారా అని. దానికి ఎవరికి తోచిన విధంగా వారు జవాబులు చెప్పుకుంటున్నారు. తిరిగే కాలు ఇంట్లో ఉండనంటోంది. అలాగే కరోనా భయం గుమ్మం దాటి బయటకు కాలు పెట్టనీయడంలేదు. ఈ నేపధ్యంలో ఎపుడు లాక్ డౌన్ ఎత్తివేస్తారు. ఎపుడు గత వైభవం లాంటి జీవితాన్ని చవిచూస్తామన్న ఆందోళన, ఆవేదన‌ అందరిలో ఉంది.

 

నిజానికి కేంద్రం లాక్ డౌన్ డేట్ ని పొడిగించమంటూ ఒక ప్రకటన తాజాగా చేసింది. అయితే దాన్ని ఎవరూ పూర్తిగా నమ్మడంలేదు. ఎందుకంటే ఒక రోజు జనతా కర్ఫ్యూతో కరోనా పై విజయం సాధించేశామనుకునే జనం ఉన్న భారతీయ సమాజంలో ఆ తరువాత నెత్తిన పిడుగులాంటి ప్రకటన వచ్చింది. మార్చి 31 వరకూ లాక్  డౌన్ అంటూ.

 

ఆ తరువాత అది కాస్తా ఏప్రిల్ 14 కి వెళ్ళిపోయింది. ఓ వైపు చూస్తూంటే దేశంలో  కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే స్కోర్ బాగా పైపైకి పోతోంది. దాంతో కరోనాపైన యుధ్ధం ఇపుడే మొదలైందన్న సంగతిని అంతా అర్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికిపుడు చూం మంత్ర కాళీ అని ఎవరైనా కరోనాని లేదనిపించే సీన్ లెదిక్కడ. 

 

కరోనా వైరస్ భారత్ లో ఎంటరైంది. అది కూడా విదేశాల నుంచి దేశంలోకి వచ్చిన వారితో వచ్చింది. దాంతో వారిని గుర్తించి నియంత్రించాలి. వారి ద్వారా మిగిలిన వారికి అంటుకుందా లేదా చూడాలి. అలనటి వారు జన సమూహంలో కలసిపోతే అది ఎందాకా పాకిందో కూడా చూడాలి. నిజంగా ఇది అతి పెద్ద కసరత్తు. ఇది భారత్ లాంటి పెద్ద దేశంలో పూర్తి కావాలంటే తక్కువలో తక్కువ రెండు నెలలు పడుతుందని అంటున్నారు.

 

దానికి మొత్తం 130 కోట్ల మంది జనం సహకరించాలి.  లాక్ డౌన్ ని పక్కాగా పాటించాలి. అంటే అసేతు హిమాచలం కదలక మెదలక ఇంట్లో కూర్చోవాలి. అలా చేస్తేనే కరోనా కట్టడి సాధ్యం. అలా చేయనంతవరకూ కరోనా భయం ఉంటుంది. అది ఉన్నంతవరకూ లాక్ డౌన్ కూడా ఉంటుంది. అంటే కరోనా కట్టడి చేయడమైనా, లాక్ డౌన్ ఎత్తివేయించుకోవడమైనా కూడా ప్రజల చేతుల్లోనే ఉంది. 

 

అందుకే ప్రభుత్వాలను లాక్ డౌన్ ఎత్తివేయమని అడగడం కంటే మనకు మనమే నియంత్రణ పాటించి ఇంట్లో ఉంటే చాలా తొందరగానే లాక్ డౌన్ ఎత్తివేస్తారు. అంటే లాడ్ డౌన్ డేట్ ఎవరి దగ్గర ఉంది అంటే జవాబు ఇపుడు సులువే కదా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: