కరోనా వైరస్ మహమ్మారి నుంచి తప్పుకోవడానికి ఏపీ మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. అత్యవసర సేవలు తప్ప, మిగతా సేవలు అన్నీ ఆగిపోయాయి. ఇక ప్రజలకు  కొంత సమయంలో నిత్యావసర వస్తువులు, కూరగాయలు తెచ్చుకునేందుకు అవకాశం కల్పించారు. అయితే లాక్ డౌన్ నేపథ్యంలో వైన్ షాపులన్నీ క్లోజ్ అయిపోయాయి. దీంతో మందు బాబులు తెగ ఇబ్బందులు పడుతున్నారు. రోజు మద్యం తాగేవారికి పలు రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.

 

మద్యం దొరకక మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. అయితే మద్యం దొరకని ఈ సమయంలో మందు బాబులు కల్లు దుకాణాల వైపు వెళ్లిపోతున్నారు. కాకపోతే లాక్ డౌన్ నేపథ్యంలో చాలాచోట్ల కల్లు దుకాణాలు నడవడం లేదు. కానీ పల్లెటూర్లలో సైలెంట్‌గా కల్లు అమ్మకాలు జరుగుతున్నాయి. పొద్దునే 5 గంటల నుంచే కల్లు తీసేసి అమ్మేస్తున్నారు. ఇక మద్యం దొరకక ఇబ్బందులు పడుతున్నవారు కల్లు తాగేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దీంతో కల్లు తాగేవాళ్ళ సంఖ్య పెరిగిపోయింది.

 

ఇక ఇలా ఉన్నకొద్ది కల్లు కోసం వచ్చే వాళ్ళ సంఖ్య పెరిగిపోవడంతో, పోలీసులు రంగంలోకి దిగేశారు. కల్లు కోసం పెద్ద సంఖ్యలో మందు బాబులు ఎగబడటంతో, కరోనా వ్యాప్తి చెందడానికి ఎక్కువ అవకాశాలున్నాయని, కాబట్టి ఎట్టి పరిస్థితిల్లోనూ కల్లు అమ్మకాలు జరపకూడదని గీత కార్మికులకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. అయితే తాడిచెట్ల మీద నుంచి కల్లు ఉన్న కుండలు తీయకపోతే, కల్లు ఎక్కువైపోయి, కుండల నుంచి కారిపోయి, చెట్ల పడిపోతుంది. దీంతో ఆ చెట్లు కల్లు గీయడానికి పనికిరావు. అలా జరగడం వల్ల గీతకార్మికులకు చాలానష్టం జరుగుతుంది.

 

దీంతో పోలీసులు గీతకార్మికులకు ఓ సలహా ఇచ్చారు. చెట్లు ఎక్కి కల్లు తీసి, పారబోసేయాలని, అమ్మడం మాత్రం చేయకూడదని చెప్పారు. కానీ అలా చేస్తే గీతకార్మికులకు ఆర్ధికంగా నష్టం జరుగుతుంది. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ లాక్ డౌన్ సమయంలో గీతకార్మికులకు ప్రభుత్వం ఆర్ధిక సాయం చేయాలని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కోరారు. మరి ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకుంటుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: