ఒకవైపు లాక్ డౌన్ అమలు చేస్తున్నా జనాల బాధ్యతా రాహిత్యం వల్ల కొరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరిగిపోతోన్నారా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనుమానం వస్తోంది. ప్రపంచదేశాలను వణికించేస్తున్న కొరోనా వైరస్ వ్యాప్తిని మనదేశంలో నియంత్రించటానికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చాలా కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నాయి. అయితే కొందరు జనాల బాధ్యతా రాహిత్యం వల్ల కేసుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరిగిపోతున్నాయి. ఇందుకు ఢిల్లీలో జరిగిన నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన మతపరమైన కార్యక్రమమే తాజా ఉదాహరణగా నిలుస్తోంది.

 

కొరోనా వైరస్ భూతం దేశప్రజలను ఇంతగా వేధిస్తున్న సమయంలో కూడా ఢిల్లీలో వేలాది మందితో మతపరమైన కార్యక్రమం జరపటమే ఆశ్చర్యంగా ఉంది. అసలు ఈ కార్యక్రమానికి ఢిల్లీ ప్రభుత్వం ఎలా అనుమతించిందో అర్ధం కావటం లేదు. ఈ కార్యక్రమం ఈనెల 13-15 తేదీల్లో జరిగింది. అంటే అప్పటికి ఈ వైరస్ ఇంతలా విజృంభించలేదని నిర్వాహకులు సమర్ధించుకున్నా ఉపయోగం లేదు. ఎందుకంటే అప్పటికే వైరస్ ప్రపంచంలో బాగా విస్తరిస్తోంది. అందుకే అప్పటికే  నలుగురు ఒకచోట గుమిగూడవద్దని ప్రభుత్వాలు జాగ్రత్తలు చెబుతునే ఉంది.

 

ఢిల్లీలో జరిగిన మూడు రోజుల  కార్యక్రమానికి 2 వేలమంది హాజరైతే ఇందులో ఏపి నుండే 500 మందున్నారు. వీరిలో రాయలసీమలోని అనంతపురం, కడప జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలతో పాటు ఉభయగోదావరి జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలున్నాయి. కార్యక్రమానికి హాజరైన వారిలో గుర్తించి అందులో 200 మందికి  ప్రభుత్వం గుర్తించి పరీక్షలు చేయించింది.  వీరిలో ఒక్క ప్రకాశం జిల్లా నుండే 103 మంది హాజరయ్యారు. 

 

కార్యక్రమానికి హాజరై వచ్చిన వారి కుటుంబాల్లో మూడు రోజుల వ్యవధిలోనే నలుగురు మరణించటంతో సంచలనంగా మారింది. ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వారికి వైరస్ ఉందన్న విషయం ఇంకా నిర్ధారణ కానప్పటికీ చాలామందికి వైరస్ సోకుంటుందనే అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. మరి 200 మందికి చేసిన పరీక్షల వివరాలు బయటకు వస్తే కానీ విషయం తేలదు.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: