ఒక్క‌టి మాత్రం నిజం..! ఇలా నీతులు చెప్పడం.. అలా గోతులు తీసి వాటిని పాతేయ‌డంలో మ‌న నేత‌ల స్టైలే వేర‌ప్పా..! గోడ‌లు దూక‌డంలో, మ‌డ‌మ‌తిప్ప‌డంలో, పిడ‌క‌లు కొట్ట‌డంలో వీళ్ల‌కు వీళ్లే సాటి.. ఇంకెవ్వ‌రూ పోటీలేరంటే అతిశ‌యోక్తికాదేమో..! అవ‌స‌రం ఉంటే బంగారు పూత పూయ‌డంలో, అదికాస్తా తీరాక బూతులు తిట్ట‌డంలో కూడా మ‌న‌వాళ్లే దిట్ట‌లు..! అధికారంలో ఉంటేనేమో *అంతా మా ఇష్టం* అంటారు.. బొమ్మ కాస్త‌ తిర‌గ‌బ‌డ‌గానే అంతా మీ ఇష్టం ఉన్న‌ట్లు చేస్తారా..? అంటూ ప్ర‌శ్న‌లు..! ఇలా మ‌న నేత‌ల గురించి వ‌ర్ణించాలంటే అక్ష‌ర‌మాల కూడా స‌రిపోదేమో..! స‌రేగానీ.. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే..! ఏపీలో ప్ర‌తిప‌క్ష నేత‌ చంద్ర‌బాబు ఉనికిపాట్లు.. చిన‌బాబు కునుకుపాట్లు ప‌డుతున్నారు. అధికార వైసీపీ దూకుడుతో బేజార‌వుతున్నారు. దిక్కు తెలియ‌ని, దారితోచ‌ని స్థితితో చంద్ర‌బాబు కంటికి కునుకులేకుండా, పార్టీకి ఉనికిలేకుండాపోతోంది. మ‌రోవైపు.. సొంత‌పార్టీ నేత‌ల్లో ఎవ‌రు ఎటువైపు నుంచి వెన్నుపోటు పొడుస్తారో తెలియ‌ని ప‌రిస్థితి..!

 

ఎలా ఉన్న‌ బాబుగారు ఇలా అయిపోయార‌నే ద‌య‌నీయ‌స్థితికి ఆయ‌న వ‌చ్చేశారు. 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌ చంద్ర‌బాబు చెప్పిన నీతిక‌థ‌ల‌నే ఇప్పుడు వైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కూడా చెబుతున్నారు.  ఆనాడు అధికారంలో ఉన్న చంద్ర‌బాబు ప్ర‌తిప‌క్ష వైసీపీని నామ‌రూపాల్లేకుండా చేయ‌డానికి ప్ర‌య‌త్నం చేశార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇందులో భాగంగానే.. వైసీపీ నుంచి 20మందికిపైగా ఎమ్మెల్యేల‌ను, ప‌లువురు ఎంపీల‌ను లాగేసుకున్నారు. ఒక‌ద‌శ‌లో ప్ర‌తిప‌క్ష వైసీపీని ఆగ‌మాగం చేశారు. జ‌గ‌న్‌కు ఊపిరాడ‌కుండా చుట్టుముట్టారు. కానీ.. చూస్తుండ‌గానే ఐదేళ్లు గ‌డిచిపోయాయి.. 2019 ఎన్నిక‌లొచ్చాయి.. వైసీపీ ప్ర‌భంజ‌నంలో టీడీపీ గ‌ల్లంత‌య్యింది. కేవలం 23 సీట్ల‌కే ప‌రిమితం అయ్యింది. చంద్ర‌బాబుకు దిమ్మ‌దిరిగి బొమ్మ‌క‌న‌బ‌డింది. చివ‌రికి చిన‌బాబు కూడా చిత్తుగా ఓడిపోయారు. పార్టీకి భ‌విష్య‌త్ ర‌థ‌సార‌థుడ‌ని అనుకుంటే అస‌లు భ‌విష్య‌త్తే ప్ర‌శ్నార్థ‌మ‌వుతోంది. ఏం జ‌రిగిందో తెలుసుకునే లోపే.. ఏకంగా న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు టీడీపీకి రాంరాం చెప్పి బీజేపీలోకి చేరిపోయారు. 

 

అయితే.. మ‌ళ్లీ బీజేపీతో దోస్తీ చేయ‌డానికి కావాల‌నే చంద్ర‌బాబు వాళ్ల‌ను పంపించార‌నే టాక్ కూడా అప్ప‌ట్లో బ‌లంగా వినిపించింది. ఇక అప్ప‌టి నుంచి చంద్ర‌బాబుకు అస్స‌లు క‌లిసిరావ‌డం లేదు. అధికార వైసీపీని ఇర‌కాటంలో ప‌డేయ‌డానికి ఉనికిప‌ట్టు ప‌డుతున్నారుగానీ.. ఎక్క‌డో ఏదో మిస్ అవుతోంది. ఇక అసెంబ్లీ స‌మావేశాల మొద‌ట్లో వైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మాట్లాడుతూ తాము తలుపులు తెరిస్తే.. టీడీపీలో ఒక్క‌రు కూడా మిగ‌ల‌రనీ, కానీ.. ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి వ‌చ్చిన వారిని మాత్ర‌మే త‌మ పార్టీలోకి తీసుకుంటామ‌ని బ‌ల్ల‌గుద్దిమ‌రీ చెప్పారు.. అమ్మో.. చంద్ర‌బాబులాగా జ‌గ‌న్ లేర‌ని, చాలా కండిష‌న్‌గా ఉన్నార‌ని ప్ర‌జ‌లుకూడా అనుకున్నారు. కానీ.. కొద్దికాలానికే.. వ‌ల్ల‌భ‌నేని వంశీ వైసీపీకి గూటికి చేరి.. చంద్ర‌బాబును తిట్టిన తిట్ల‌ను ఎవ‌రు మ‌రిచిపోగ‌ల‌రు..! మొన్నామ‌ధ్య ప‌లువురు టీడీపీ నాయ‌కులు వ‌రుస‌బెట్టి వైసీపీలో చేరిపోయారు. దీంతో మ‌రోసారి రుజువు అయింది.. అధికారంలో ఉంటే అంద‌రూ అంతేన‌ని! 

 

ఇక ఇప్పుడు టీడీపీ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు వైసీపీలో చేరేందుకు రెడీగా ఉన్నార‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. ఇందులో ఎంత‌వ‌ర‌కు నిజం ఉందో తెలియ‌దుగానీ.. ఒక్క‌టిమాత్రం నిజం.. ఎమ్మెల్యేలు,ప‌లువురు నాయ‌కులు తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్లు తెలుస్తోంది. చంద్ర‌బాబు, లోకేష్ తీరుపై కూడా తీవ్ర అస‌హ‌నంతో ర‌గిలిపోతున్నార‌ట‌! పాపం! టీడీపీ ఎమ్మెల్యేల మాట‌ను గ్రామ‌పంచాయ‌తీ సిబ్బంది కూడా విన‌డం లేద‌ట‌! ఎక్క‌డికి వెళ్లినా ప‌నులేమీ కావ‌డం లేద‌ట‌. పూర్తిగా నిస్స‌హాయ స్థితిలో ప‌డిపోయారు. చివ‌రికి ఇటీవ‌ల స్థానిక ఎన్నిక‌ల్లో నామినేష‌న్లు కూడా వేయ‌లేని స్థితి.. వేసుకోనివ్వ‌ని ప‌రిస్థితి! ఇంత‌టి ద‌య‌నీయ ప‌రిస్థితుల మ‌ధ్య  ఇందులో ఉండ‌డం క‌న్నా.. హాయిగా అధికార వైసీపీ గూటికి పోవ‌డం మంచిద‌నే ఆలోచ‌న‌కు ప‌లువురు ఎమ్మెల్యేలు వ‌చ్చిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే.. అధికార వైసీపీ ప‌నితీరుపై చంద్ర‌బాబు ఎప్ప‌టిక‌ప్పుడు ప్రెస్‌మీట్లు పెట్టిమ‌రీ చెబుతున్నా.. ఎవ‌రు కూడా ప‌ట్టించునే ప‌రిస్థితిలేదు. ఆ.. ఆ రోజు మీరు కూడా అలాగే చేశారుక‌దా.. అంటూ జ‌నం అనుకుంటున్నార‌ట‌! చూద్దాం మ‌రి ఏం జ‌రుగుతుందో..!

 

మరింత సమాచారం తెలుసుకోండి: