ప్రాణాల‌కు తెగించి క‌రోనా బాధితుల‌కు వైద్యులు, సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. వీరి సేవ‌ల‌ను ప్ర‌పంచ‌మంతా కొనియాడుతోంది. ఇప్ప‌టికే ఇట‌లీలో ప‌లువురు వైద్యులు కూడా క‌రోనా బారిన‌ప‌డి మృతి చెందారు. మ‌రికొంద‌రు చికిత్స పొందుతున్నారు. తాజాగా.. ఇండియాలో కూడా ఓన‌ర్సు క‌రోనా బారిన‌ప‌డ్డారు.  కేర‌ళ‌కు చెందిన న‌ర్సు కొద్దిరోజులుగా క‌రోనా బాధితుల‌కు చికిత్స‌లు అందిస్తోంది. ఈ క్ర‌మంలో ఆమె కూడా వైర‌స్‌బారిన ప‌డ్డారు. దీంతో స్థానికంగా తీవ్ర ఆందోళ‌నక‌ర ప‌రిస్థితి నెల‌కొంది. ఇక దేశ‌వ్యాప్తంగా  21 రోజుల లాక్‌డౌన్ ఉన్నప్పటికీ, కోవిడ్ -19 కేసుల సంఖ్య మాత్రం క్ర‌మంగా పెరుగుతూనే ఉంది. సోమవారం రాత్రి వ‌ర‌కు క‌రోనా కేసుల సంఖ్య‌ 1,251 కు చేరుకుంది. ఇక్క‌డ షాకింగ్ న్యూస్ ఏమిటంటే... అత్య‌ధికంగా ఒకే రోజు 227 కేసులు నమోదు కావ‌డం. ఇక మృతుల సంఖ్య 32కు చేరుకుంది. కొంత‌మేర‌కు క‌రోనా ప్ర‌భావం త‌గ్గింద‌నుకుంటున్న త‌రుణంలో బాధితుల సంఖ్య పెరుగుతుండ‌డం అంద‌రిలో ఆందోళ‌న క‌లిగిస్తోంది. 

 

అయితే.. లాక్‌డౌన్ నేప‌థ్యంలో క‌రోనాను కొంత‌మేర‌కు క‌ట్ట‌డి చేయగ‌లిగామ‌ని, ఈ మ‌హ‌మ్మారిపై మ‌నం విజ‌యం సాధిస్తామ‌ని ప్ర‌ధాని మోడీ ఆదివారం నిర్వ‌హించిన మ‌న్‌కీబాత్‌లో చెప్పారు. నిజానికి.. కొవిడ్‌-19 నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా కొంత‌మేర‌కు ఆశాజ‌నకంగానే క‌నిపిస్తోంది. కానీ.. అనూహ్యంగా మ‌ళ్లీ కేసుల సంఖ్య పెరుగుతుండ‌డంతో మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ప‌లువురు విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనావైరస్ కేసుల సంఖ్య 784,000పైగా చేరుకోగా.. ఇప్పటివరకు దాదాపు 38,000 మంది మరణించారు. ఇటలీలో ఇప్పటివరకు 11,591 మంది మృతి చెందారు.  101,739 కేసులు న‌మోదు అయ్యాయి. స్పెయిన్లో 7,716 మరణాలు, 87,956 కేసులు నమోదయ్యాయి. చైనాలో ఇప్పటివరకు 3,304 మరణాలు, 81,470 కేసులు న‌మోదు అయ్యాయి. ఇక అమెరికాలో 163,490 కేసులు, 2,148 మంది మ‌ర‌ణించారు. జర్మనీలో కూడా దీని ప్ర‌భావం ఎక్కువ‌గానే ఉంది. ఇప్పటివరకు 66,885 కేసులు, 645 మంది మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: