విజయ్ మాల్యా...విలాస పురుషుడు...బ్యాంకులకు రూ.వేల కోట్లు టోకరా పెట్టి బ్రిటన్‌కు పారిపోయిన పారిశ్రామిక వేత్త. సుమారు రూ.9 వేల కోట్ల మేర బ్యాంకులను మోసగించి విదేశాలకు పారిపోయిన మాల్యాను భారత్‌కు రప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. కొద్దికాలం క్రితం మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు ఆమోదం తెలుపుతూ బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై ఆ దేశ హోం శాఖ మంత్రి సాజిద్ జావీద్ సంతకాలు చేశారు. అయినప్పటికీ ఆ నిర్ణయం పెండింగ్​లో పడింది. అలా అజ్ఞాతంలో జీవితం గడుపుతున్న విజయ్​మాల్యా తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

 

 

తాజా పరిస్థితుల నేపథ్యంలో విజయ్​మాల్యా స్పందిస్తూ...తాను తీసుకున్న రుణాలను చెల్లించేందుకు ముందుకొచ్చారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వానికి భారీగా నిధులు అవసరమైన ప్రస్తుత తరుణంలో గతంలో తాను కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ కోసం తీసుకున్న అప్పు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగానే ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు.

 


‘కింగ్‌ఫిషర్‌ కంపెనీ కోసం నేను తీసుకున్న రుణాన్ని 100శాతం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని మరోసారి తెలుపుతున్నా. కానీ రుణాలు తిరిగి తీసుకొనేందుకు బ్యాంకులు సిద్ధంగాలేవు. నా ఆస్తులను సీజ్‌చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కూడా వాటిని విడుదల చేయనంటోంది. ఇప్పుడు కరోనా కష్టాల్లో ఉన్నందున ఇప్పుడైనా నా వినతిని పరిగణనలోకి తీసుకోవాలని భారత ఆర్థిక మంత్రిని కోరుతున్నాను’ అంటూ విజయ్​ మాల్యా బహిరంగంగా అప్పీల్​ చేశారు. భారత ప్రభుత్వం వెనుకాముందు ఆలోచించకుండా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ప్రకటించిందని, దాంతో తన కంపెనీలన్నీ బలవంతంగా మూసేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.  కాగా, ఇలాంటి స‌మ‌యంలో లిక్క‌ర్ కింగ్ ప్ర‌తిపాద‌న‌ను కేంద్రం ఏ విధంగా చూస్తుంది? ఆయ‌న కామెంట్ల‌ను సీరియ‌స్‌గా తీసుకుంటుందా? అప్పులు క‌ట్టేందుకు అవ‌కాశం ఇస్తుందా? అనేది వేచి చూస్తేనే...తెలిసేది.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: