కరోనా వైరస్ వ్యాప్తి దాని తదనంతర పరిణామాల కారణంగా రాష్ట్రాలు తమ ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఉద్యోగుల జీతాల్లో 10 శాతం నుంచి 60 శాతం వరకూ కోత పెట్టేశారు. ఈ కోత ఎన్నాళ్లుంటుందో కూడా క్లారిటీ లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కబడే వరకూ అనుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఏపీలో ఉద్యోగుల గుండెలు కూడా దడదడలాడాయి. కేసీఆర్ తరహాలోనే తమ జీతాల్లోనూ భారీ కోత తప్పదేమో అని భయపడ్డారు.

 

 

ధనిక రాష్ట్రంగా చెప్పుకునే తెలంగాణయే అంత బాగా కోత పెడితే.. జగన్ మాత్రం ఊరుకుంటాడా.. అంతకు ఏమాత్రం తగ్గకుండానే కోత పెడతాడని ఊహించారు. ఏ ప్రకటన వస్తుందో ఏమో అని ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే ఏపీ సర్కారు నుంచి జీతాల విషయంలో వచ్చిన ప్రకటన వారికి చాలా ఊరట కలిగించింది. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను రెండు విడతల్లో చెల్లిస్తామని సీఎం జగన్‌ చెప్పినట్లు ఏపీ రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు.

 

 

అసలు జీతంలోనే భారీ కోత పడుతుందని అనుకుంటే.. అసలు సీఎం అలాంటి ప్రస్తావన తీసుకురాలేదని వారి మాటల్లో తెలుస్తోంది. రెండు విడతల్లో ఇస్తామంటే మొత్తం ఇస్తామన్నట్టే కదా. కోత గీత ఉంటే ఆ సంగతి చెప్పేవారే కదా.. అంటే కోత లేనట్టే అన్నమాట. కాకపోతే జీతం రెండు విడతలుగా వస్తుంది. అంతే కదా.. అసలు వచ్చేది ఉంటే రెండు విడతలైతేనేం మూడు విడతలైతేనేం.. అనుకున్నారు కాబోలు ఏపీ ఉద్యోగులు. దీంతో ఆ కేసీఆర్ కంటే మా జగనే మంచోడు అని చెప్పుకుంటున్నారు.

 

 

కరోనా వ్యాప్తి కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న నేపథ్యంలో ఈ నెలలో సగం వేతనం చెల్లిస్తామని, నిధులు సర్దుబాటు అయ్యాక మిగతా సగం చెల్లిస్తామని సీఎం చెప్పారని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. అంతే కాదు.. ఈ ఒక్క నెల మాత్రమే రెండు విడతల్లో చెల్లిస్తామని సీఎం చెప్పారట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: