జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాష్ట్రంలోని వివిధ అంశాల‌పై స్పందించారు. ఇటు సోష‌ల్ మీడియా అటు ప‌త్రికా ప్ర‌క‌ట‌న ద్వారా పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ అంశాల‌పై విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారి విజృంభించడంతో విధించిన లాక్ డౌన్ మూలంగా భవన నిర్మాణ కార్మికులు, ఉద్యాన రైతులు, ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారి గురించి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం స్పందించాలని జ‌నసేనాని కోరారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను వివరిస్తూ “రాష్ట్రంలో 21లక్షల మంది గుర్తింపు పొందిన భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. మరో 30లక్షల మంది వరకు గుర్తింపు పొందని కూలీలు ఉన్నారు. కేంద్ర కార్మికశాఖ మంత్రి .. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలనాధికారులకు నిధులు విడుదల చేసేలా లేఖలు రాశారు. కార్మిక సంక్షేమ బోర్డులు వసూలు చేసే సెస్స్ నుంచి ఆ కార్మికులకు సహాయం చేయవచ్చు. లాక్ డౌన్ మూలంగా ఆ కార్మికులు తమ జీవనోపాధి కోల్పోయారు. బోర్డు దగ్గర ఉన్న నిధులు గుర్తింపు ఉన్న కార్మికులకు ఉపయోగపడతాయి. బోర్డు దగ్గర నమోదు చేయించుకున్న గుర్తింపు పొందిన కార్మికుల కంటే ఎలాంటి గుర్తింపు పొందని కార్మికుల సంఖ్యే ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కువగా ఉంది. వారెవరూ సాయానికి అర్హులు కారు. అలా నమోదు కానివారికి సహాయం చేసే నైతిక బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందా? కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం అందరికీ ఆ సాయం ఇస్తారా?” అని ప్రశ్నించారు.

 


ఉద్యాన రైతుల‌కు రూ.3 వేల కోట్ల నిధి అని ప్రకటించారని దాని సంగ‌తి ఏంట‌ని ప‌వ‌న్ ప్ర‌శ్నించారు. ఉద్యాన రైతుల సమస్యలు తెలియచేస్తూ “రాష్ట్రంలో 17.62 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు పండిస్తున్నారు. 327.57 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తోంది. ఉద్యాన పంటలనేవి చాలా ముఖ్యమైనవి. ఈ పంటలు పండిస్తున్న రైతులు ఈ క్లిష్ట సమయంలో ఎంతో ఇబ్బందుల్లో న్నారు. ముఖ్యంగా అరటి రైతులు నష్టాల పాలవుతున్నారు. గత కొన్ని నెలలుగా ఈ రైతులు పంటపై పెట్టుబడిపెట్టారు. తమ పంట అమ్ముకొనే సమయం ఇది. లాక్ డౌన్ తో మార్కెట్లు మూతపడ్డాయి. వెంటనే అమ్ముకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఉత్పత్తులను ప్రభుత్వం ఎందుకు నేరుగా కొనుగోలు చేయడం లేదు? కొనుగోలును సులభతరం చేయవచ్చు కదా? ధరల స్థిరీకరణకు రూ.3 వేల కోట్లు కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడైనా ఆ నిధులు ఇస్తారా?` అంటూ ప‌వ‌న్ సందేహాలు వ్య‌క్తం చేశారు. 

 

ఆక్వా రైతుల్లో సందేహాలు ఉన్నాయ‌ని ప‌వ‌న్ ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. ``ఆక్వా సాగు, ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఈ రంగం 14.5 లక్షల మందికి ఉపాధి ఇస్తోంది. రాష్ట్ర జి.ఎస్.డి.పి.లో 7.4 శాతం వాటా ఈ రంగానిదే. ప్రస్తుత లాక్ డౌన్ వల్ల సరైన ధర లేక ఆక్వా రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. 14 ఏప్రిల్ వరకూ వనామీ రొయ్యకు ధరలు నిర్ణయిస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే ఆక్వా రైతుల్లో పలు సందేహాలున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన పూర్తి ధర తమకు దక్కుతుందా? ఏమైనా తగ్గించేస్తారా.. దళారులు దోచుకొంటారా అనే ఆందోళన ఉంది. ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్స్ కి వందల మంది కావాలి. కరోనా భయంతో  ప్లాంట్స్ మూతపడటమో లేదా కొంత మేరకే నడవడమో చేస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధర పూర్తిగా ఆక్వా రైతుకు దక్కుతుందా? ఆ విషయాన్ని పర్యవేక్షించే యంత్రాంగం ఉందా?` అంటూ ప‌వ‌న్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: