ఇప్పుడు ప్రపంచం మొత్తం కరోనా వైరస్ మహమ్మారికి వణికిపోతున్న విషయం తెలిసిందే. అయితే ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు కరోనా దెబ్బకు భయపడుతుంటే ఉత్తరకొరియా మాత్రం పెద్దగా కరోనా గురించి పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. అసలు ఆ దేశంలో  ఎన్ని కరోనా  కేసులు నమోదయ్యాయో ఎవరికీ తెలియదు. దీంతో అధ్యక్షుడు కిమ్,  కరోనా విషయం వదిలేసి...మిస్సైల్ ప‌రీక్ష‌లో త‌ల‌మున‌క‌లై ఉన్నాడు. 

 

తాజాగా కిమ్ సేన ఈస్ట్‌కోస్ట్ ఏరియాలో రెండు షార్ట్ రేంజ్ బాలిస్టిక్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించింది. ఈ విష‌యాన్ని సౌత్‌కొరియా అధికారులు ధృవీక‌రించారు. జపాన్‌, కొరియా, రష్యాల సరిహద్దులో ఉన్న ద్వీపం లక్ష్యంగా ఆదివారం ఈ రాకెట్ లాంచర్ల ప్రయోగం జరిగిందని సమాచారం. కిమ్ సేన చర్యలని పక్కనే ఉన్న దక్షిణ కొరియా తప్పుబట్టింది  కరోనాపై ప్రపంచమంతా పోరాడుతున్న వేళ, ఉత్తర కొరియా ఇలా ప్రవర్తించడం అనుచితమైన చర్యని, క్షిపణి ప్రయోగాలను అమెరికా ఇంటెలిజెన్స్‌ వర్గాలు కూడా నిశితంగా పరిశీలిస్తున్నాయని తెలిపింది.

 

అయితే కొరియా ఇలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడటాన్ని అమెరికా కూడా తీవ్రంగా తప్పుబట్టింది. యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో.. కిమ్ సేనపై విరుచుకుపడ్డారు. అణ్వాయుధ పరీక్షలు నిలిపివేసేలా నార్త్ కొరియాపై ఇతర దేశాలు ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు.

 

అయితే అమెరికా తీవ్రంగా స్పందించడంతో ఉత్తర కొరియా కూడా ఏ మాత్రం తగ్గకుండా కౌంటర్ ఇచ్చింది. అసలు అగ్రరాజ్యానికి నిజంగా భయం ఎలా ఉంటుందో చూపించాలని ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక ఇప్పుడు అమెరికాతో తమకు ద్వైపాక్షిక సంబంధాలు కూడా పెద్ద విషయం కాదని ఉత్తర కొరియా వర్గాలు తేల్చి చెప్పాయి. పైగా మైక్ పాంపియో హద్దు మీరి మాట్లాడారని గట్టి వార్నింగ్ ఇచ్చింది.

 

ఇక కిమ్ సేన దూకుడు చూస్తుంటే అమెరికాని గట్టిగానే టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. ఓ వైపు ప్రపంచమంతా కరోనాకు భయపడుతుంటే, కిమ్ సేన మాత్రం అమెరికాని భయపెడతాం అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: