ఎలాంటి ప్ర‌తికూల ప‌రిస్థితుల‌నైనా క‌చ్చితంగా అంచ‌నా వేసి, స‌త్ఫ‌లితాల‌ను రాబ‌ట్ట‌డంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ది ప్ర‌త్యేక‌మైన శైలి. వాస్త‌వికత ఆధారంగా క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో, క‌చ్చిత‌మైన ఫ‌లితాల‌ను సాధించ‌డంలో ఆయ‌న‌ది ప్ర‌త్యేక‌మైన పంథా. కానీ.. ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా వైర‌స్ విష‌యంలో మాత్రం సీఎం కేసీఆర్ లెక్క త‌ప్పారా..? అధికారులు చెప్పిన విష‌యాల‌ను న‌మ్మి క‌రోనా ప్ర‌భావాన్ని త‌క్కువ‌గా అంచ‌నా వేశారా..? అంటే తాజా ప‌రిస్థితులు మాత్రం ఔన‌నే అంటున్నాయి. చైనాలోని వుహాన్ న‌గ‌రం కేంద్రంగా పుట్టిన క‌రోనా వైర‌స్ చూస్తుండ‌గానే ప్ర‌పంచాన్ని చుట్టేసింది. దేశాల‌న్నీ అత‌లాకుత‌లం అవుతున్నాయి. వేలాదిమంది ప్రాణాల‌ను కోల్పోతున్నారు. ప్ర‌పంచంలోనే బ‌ల‌మైన దేశాల‌న్నీ కూడా కుదేల‌వుతున్నాయి. అయితే.. మిగ‌తా దేశాల‌తో పోల్చితే భార‌త్‌లో మాత్రం ప‌రిస్థితి అదుపులోనే ఉన్న‌ట్టు క‌నిపించింది ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్ర‌కంప‌న‌ల‌కు ముందు.. క‌రోనా విష‌యంలో మ‌ర్క‌జ్‌కు ముందు.. మ‌ర్క‌జ్ త‌ర్వాత అనే స్థాయికి ప‌రిస్థితులు చేరుకున్నాయి. 

 

నిజానికి.. చైనాలో క‌రోనా బీభ‌త్సం సృష్టిస్తున్న స‌మ‌యంలోనే కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చాలా తేలిక‌గా తీసుకున్నాయి. ఆ క‌రోనా మ‌న‌కు రాదులే.. మ‌న‌ల్ని ఏమీ చేయ‌లేదులే.. అన్నంతా నిర్ల‌క్ష్యం ప్ర‌ద‌ర్శించాయి. ఇక తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అసెంబ్లీ స‌మావేశాల్లో మాట్లాడుతూ.. క‌రోనాకు పారాసిట‌మోల్ మాత్ర చాలంటూ తేలిక‌గా కొట్టిపారేశారు. కానీ.. చూస్తుండ‌గానే ప‌రిస్థితులు చేజారిపోయాయి. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన సీఎం కేసీఆర్ వెంట‌నే అప్ర‌మ్త‌త‌మై వెంట‌నే విద్యాసంస్థ‌ల‌కు సెల‌వులు ప్ర‌క‌టించారు. కేంద్ర ప్ర‌భుత్వం కన్నా ముందే లాక్‌డౌన్ ప్ర‌క‌టించారు. వెంట‌నే అధికార‌యంత్రాంగాన్ని అప్ర‌మ‌త్తం చేశారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై ప్ర‌జ‌ల్లో విస్తృతంగా అవ‌గాహ‌న క‌ల్పించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఢిల్లీ నుంచి వ‌చ్చిన‌ ఇండోనేషియాకు దేశ‌స్తులు క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ప‌ర్య‌టించడంలో క‌ల‌క‌లం రేగింది. వారిలో ఒక‌రికి క‌రోనా పాజిటివ్ అని తేలండంతో క‌రీంన‌గ‌ర్ ప‌ట్ట‌ణంలో అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంది. ఇక ప‌రిస్థితుల‌న్నీ కూడా అదుపులోకి వ‌స్తున్నాయ‌న్న వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది.

 

ఇక ఇటీవ‌ల సీఎం కేసీఆర్ విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేసి, ఏప్రిల్ 7న శుభ‌వార్త వింటార‌ని, క‌రోనా ఫ్రీ తెలంగాణ అవుతుంద‌ని, అయినా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అన్నారు. ఆ మ‌రునాడే షాకింగ్ న్యూస్‌.. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని మ‌ర్క‌జ్‌లో జ‌రిగిన మ‌త‌ప్రార్థ‌న‌ల‌కు పెద్ద ఎత్తున వివిధ దేశాల‌నుంచి ముస్లింలు హాజ‌రుకావ‌డం.. తెలంగాణ నుంచి కూడా పెద్ద సంఖ్య‌లో వెళ్లిన‌ట్లు వార్త‌లు రావ‌డం, ఏకంగా అందులో ఆరుగురు మ‌ర‌ణించ‌డం, మంగ‌ళ‌వారం నాడు 15కొత్త కేసులు న‌మోదు కావ‌డంతో ఒక్క‌సారిగా మ‌ళ్లీ భ‌యాందోళ‌న‌లు మొద‌ల‌య్యాయి. తెలంగాణ నుంచి హాజ‌రైన వారి కోసం అధికారులు గాలిస్తున్నారు. మున్ముందు ఏం జ‌రుగుతుందోన‌ని ప్ర‌జ‌లు కూడా ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. అయితే.. ఆరోజు క‌రీంన‌గ‌ర్‌లో ప‌ర్య‌టించిన‌ ఇండోనేషియా దేశ‌స్తుల నుంచి స‌మ‌గ్ర స‌మాచారం రాబ‌ట్ట‌డంలో అధికారులు విఫ‌లం చెందార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్త‌న్నాయి. ఆరోజు వారి నుంచి స‌మ‌గ్ర సమాచారం రాబ‌డితే ఢిల్లీ నిజాముద్దీన్ విష‌యం బ‌య‌ట‌ప‌డేద‌ని, దీంతో ప్ర‌భుత్వం మ‌రిన్ని క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉండేద‌ని టాక్ వినిపిస్తోంది. అధికారులు ఇచ్చిన త‌ప్పుడు స‌మాచారం వ‌ల్లే.. సీఎం కేసీఆర్ క‌రోనా తీవ్ర‌త‌ను అంచ‌నా వేయ‌లేక‌పోయార‌ని ప‌లువురు అంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: