ఏపీలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకూ 87 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న రాత్రి 9 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకు 43 కొత్త కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో అత్యధికంగా 15 కేసులు నమోదు కాగా పశ్చిమ గోదావరిలో 13, చిత్తూరు జిల్లాలో 5, ప్రకాశం జిల్లాలో 4, తూర్పు గోదావరిలో 2, నెల్లూరు జిల్లాలో 2, కృష్ణా... విశాఖ జిల్లాలలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. 
 
12 గంటల్లో 43 కొత్త కేసులు నమోదు కావడంతో బాధితుల సంఖ్య 87కు చేరింది. రాష్ట్రంలో భారీగా కొత్త కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభుత్వం నిబంధనలలో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్తగా నమోదైన కేసుల్లో ఢిల్లీలోని ప్రార్థన సదస్సుకు హాజరైన వారే ఎక్కువ మంది ఉన్నారని సమాచారం. 
 
రాష్ట్రంలోని 13 జిల్లాలలో 11 జిల్లాలలో కరోనా కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో మాత్రం ఇప్పటివరకూ పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. ప్రభుత్వం ఈరోజు ట్విట్టర్ ద్వారా కొత్త కేసుల జాబితాను విడుదల చేసింది. 12 గంటల్లో 43 కొత్త కేసులు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. నిన్నటివరకూ ఒక్క కేసు కూడా నమోదు కాని జగన్ సొంత జిల్లా కడపలో ఒకేరోజు 15 కేసులు నమోదయ్యాయి. 
 
ఈరోజు సాయంత్రానికి ఏపీలో కరోనా బాధితుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకూ రాష్ట్రంలో నమోదైన కేసుల్లో ఇద్దరి పరిస్థితి మెరుగైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. గత 12 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 373 నమూనాలకు పరీక్షించగా... అందులో 330 రిపోర్టులు నెగిటివ్ గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. కేసుల సంఖ్య భారీగా పెరుగుతూ ఉండటంతో ప్రభుత్వం ప్రజలను పూర్తిగా ఇళ్లకే పరిమితం చేసేలా ఆదేశాలు జారీ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: