అగ్రరాజ్యం అమెరికా మీద కరోనా వైరస్ దెబ్బ మామూలుగా లేదు. ప్రపంచం మొత్తాన్ని వణికించేస్తున్న వైరస్ సమస్య అమెరికాలో మాత్రం రోజురోజుకు పెరిగిపోతోంది. మందులు లేని సమస్య కావటంతో పాటు ముందు నిర్లక్ష్యం వహించటం కూడా అమెరికాలో సమస్య పెరిగిపోవటానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అమెరికా మొత్తం మీద మంగళవారం ఒక్క రోజునే వెయ్యిమంది మరణించటం సంచలనంగా మారింది.

 

మామూలుగా ఎటువంటి సమస్య వచ్చినా అమెరికా పెద్దగా చలించదు. ఇతర దేశాలపై అమెరికా ఇంత వరకు చేసిన యుద్ధాల్లో కూడా ఎప్పుడూ ఒక్కరోజులో ఇన్ని వందల మంది చనిపోయుండరు.  అలాంటిది కంటికి కనిపించని వైరస్ దెబ్బకు ఒకే రోజులో వెయ్యిమంది చనిపోవటంతో దేశం మొత్తం మీద టెన్షన్ పెరిగిపోతోంది. రోగులకు సరిపడా బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు కూడా  లేవు.

 

దాంతో అనూహ్యంగా పెరిగిపోతున్న రోగుల సంఖ్యకు తగ్గట్లుగా ఆసుపత్రులు లేకపోవటంతో వచ్చిన రోగులందరినీ  చేర్చుకోవటం లేదు. కేవలం బతికే అవకాశం ఉన్న వాళ్ళను మాత్రమే ఆసుపత్రులు చేర్చుకుంటుండటంతో మిగిలిన వాళ్ళు బయటే ఉండిపోతున్నారు. దాంతోనే చనిపోయిన రోగుల సంఖ్య మంగళవారం వందలకు చేరుకుంది.  ఒక్క రోజులో ఇప్పటి వరకూ ఇన్ని వందల మంది వైరస్ తో అమెరికాలో చనిపోలేదు.

 

అమెరికాలో పరిస్ధితులు చూస్తుంటే రాబోయే రోజుల్లో వైరస్ దెబ్బకు రోగులు, చనిపోయే వారి సంఖ్య రోజుకు వేలకు చేరుకున్నా ఆశ్చర్యం లేదని ప్రభుత్వం, డాక్టర్లు టెన్షన్ పడుతున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ మొత్తం మీద అమెరికాలో మరణాల సంఖ్య సుమారు 2.5 లక్షలకు చేరుకుంటుందని స్వయంగా ప్రకటించాడంటేనే పరిస్ధితి ఎంత దుర్భరంగా మారిపోతోందో అర్ధమవుతోంది. మరణాల సంఖ్యలో అమెరికా ఇటలీ, స్పెయిన్ తో పోటి పడుతుండటంతో ప్రపంచం మొత్తం మీద టెన్షన్ పెరిగిపోతోంది. ఎందుకంటే అమెరికాలో ఏమి జరిగినా దాని ప్రభావం ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రపంచదేశాలపైన ఉంటుంది కాబట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: