దేశంలో గత రెండు రోజుల నుంచి వందల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో కూడా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశంలో కరోనా వైరస్ భారీ స్థాయిలో వ్యాపించటానికి పరోక్షంగా నిజాముద్దీన్ మర్కజ్ మసీద్ కారణమైంది. అక్కడ జరిగిన సమావేశాలకు హాజరైన వారికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. అంతర్జాతీయంగా ప్రసిద్ధి గాంచిన ఈ మర్కజ్ కు మన దేశం నుంచే గాక ఇతర దేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు. 
 
ఈ సంవత్సరం కూడా మర్చి 14, 15 తేదీలలో జరిగిన సమావేశాలకు ప్రార్థనల కోసం భారీ సంఖ్యలో హాజరయ్యారు. వివిధ దేశాల నుంచి అక్కడికి వచ్చిన వారిలో కొంతమందికి అప్పటికే కరోనా వైరస్ సోకడంతో దేశవ్యాప్తంగా పలువురు కరోనా భారీన పడ్డారు. దాదాపు 100 సంవత్సరాలుగా ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుగుతోందని తెలుస్తోంది. నిజాముద్దీన్ ప్రతినిధులు 3 నుంచి 5 రోజులు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుగుతుందని... సంవత్సరం ముందే కార్యక్రమ తేదీలు ఖరారవుతాయని చెబుతున్నారు. 
 
గత మూడు రోజుల నుంచి ఢిల్లీలో జరిగిన సమావేశాల వల్లే కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందిందని ప్రచారం జరగడంతో కేజ్రీవాల్ ప్రభుత్వం మర్కజ్ పెద్దలపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమైందని తెలుస్తోంది. తబ్లీక్ జమాత్ ప్రతినిధులు మాత్రం తాము ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని చెబుతున్నారు. తాము ప్రతిసారి ప్రభుత్వాలకు సహకరించామని... అధికారుల సూచనల మేరకు నడుచుకునేందుకు సిద్ధమని ప్రకటించారు. 
 
మరోవైపు దేశంలో ఇప్పటివరకూ 1637 మంది కరోనా భారీన పడ్డారు. వీరిలో 38 మంది మృతి చెందారు. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ విషయాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 12 గంటల్లో 240 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఒక్కరోజే 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో బాధితుల సంఖ్య 87కు చేరింది. భారీగా కేసుల సంఖ్య పెరగడంతో కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రజలను అప్రమత్తం చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: