కరోనా వైరస్ దశల గురించి ఇప్పటికే ప్రముఖులు, నిపుణులు చెబుతూ వచ్చారు. కరొనా వైరస్ వివిధ దశలు, దాని విశ్వరూపాన్ని చవి చూసిన దేశాలు కూడా కళ్ళ  ముందే ఉన్నాయి. ఇటలీ శవాల దిబ్బగా మారిపోయింది. అగ్ర రాజ్యం అమెరికా విలవిలలాడుతోంది. ఈ నేపధ్యంలో అతి పెద్ద దేశం, పేదల దేశంగా ఉన్న భారత్ లో కరోనా వైరస్  గురించి అందరూ చెబుతూనే ఉన్నారు.

 

ఇంట్లో  ఉండండి అలా ఉంటేనే అందరికీ శ్రీరామ రక్ష అని కూడా చిలక్కి చెప్పినట్లుగా చెప్పారు. అయినా కూడా విన్న వారు విన్నారు, లేని వారు వినలేదు. ఈ సమయంలో కూడా అనవసరంగా తిరిగిన వారున్నారు. వారు మిగిలిన వారిని అంటించారు.

 

ఎంతో చదువుకున్నామని, ఎక్కడో ఉంటూ గొప్ప ఉద్యోగాలు చేస్తున్నామనుకున్న వారు సైతం సామాజిక బాధ్యత మరచారు. తప్పుడు చిరునామాలు ఇచ్చారు. వారు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి స్వీయ క్వారంటైన్ కాకుండా కొందరు వ్యవహరించారు. ఇక మరికొందరు పెద్ద గుంపులుగా చేరి చేయాల్సినవి చేశారు.

 

ఇలా సామాజిక దూరం మనంలో మనమే పాటించకుండా చాలా దూరం వచ్చేశాం. ఇకనైనా మనమంతా ఒక్కటిగా ఉంటామని ఒట్టేసి ప్రతి వారు తమ ఇంట్లో ఒంటరిగా ఉండాలి. అలాగైతేనే కరోనా వైరస్ ని అరికట్టగలం. భగవంతుడి దయ వల్ల మూడవ దశలోకి రాలేదు అని  వైద్య నిపుణులు అంటున్నారు.

 

ఇప్పటికైతే ఇంకా కరోనాని అదుపు చేయగలమని మన వైద్యులు అంటున్నారు. ఇది సంతోషం కల్గించే మాటగానే తీసుకుని రానున్న పద్నాలుగు రోజులూ కరోనా వైరస్ ని తరిమేలా ప్రతిన పూనాలి. అపుడే అది అంతమవుతుంది. 

 

లేకపోతే మన కళ్ళ ముందు ఇతర దేశాల అనుభవాలు చాలానే ఉన్నాయి. అవి గుర్తుపెట్టుకుని మన కోసం, మనవారి కోసం అంతా ఇంట్లోనే కొన్నాళ్ళు గడపాల్సిన అవసరం ఉంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: