పాకిస్తాన్‌లో హిందువులు, క్రైస్త‌వ మైనారిటీలు ఆక‌లితో అల‌మ‌టిస్తున్నారు.  తిన‌డానికి తిండిలేక‌, తాగ‌డానికి నీళ్లు లేక తీవ్ర వివ‌క్ష‌కు గుర‌వుతున్నారు. క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి పాకిస్తాన్‌లో కూడా లాక్‌డౌన్ కొన‌సాగుతోంది. ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. నిత్యావ‌స‌రాలు తీర‌క బిక్కుబిక్కుమంటూ గ‌డుపుతున్నారు. ఇక ఇందులో మైనారిటీలుగా ఉన్న హిందువులు, క్రైస్త‌వులు ప‌రిస్థితి మ‌రింత ద‌య‌నీయంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక్క‌డ తాము తీవ్ర వివ‌క్ష‌కు గుర‌వుతున్నామ‌ని ప‌లువురు హిందువులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. అయితే.. లాక్‌డౌన్ నేప‌థ్యంలో పాకిస్తాన్ ప్ర‌భుత్వ అధికారులు కేవ‌లం ముస్లింల‌కు మాత్ర‌మే నిత్యావ‌స‌ర స‌రుకులు ఇస్తున్నార‌ని, వారికి మాత్ర‌మే అవ‌స‌రాలు తీర్చుతున్నార‌ని, కానీ.. హిందువులకు, క్రైస్త‌వుల‌కు నిత్యావ‌స‌ర స‌రుకులు ఇవ్వ‌డంలేద‌ని ప‌లువురు క‌న్నీటిప‌ర్యంత‌మ‌వుతున్నారు. చాలా రోజులుగా బియ్యం లేవ‌ని, త‌మ‌కు బియ్యం కూడా ఇవ్వ‌డం లేద‌ని వాపోతున్నారు. క‌రాచీ త‌దిత‌ర ప్రాంతాల్లో ఉన్న కూలీలు ఆక‌లితో అల‌మ‌టిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. 

 

పాకిస్తాన్‌లోని సింధు ప్రావిన్స్‌లో సుమారు ఐదుల‌క్ష‌ల మందికిపైగా హిందువులు జీవిస్తున్నారు. ఇక పాకిస్తాన్ దేశ జ‌నాభాలో సుమారు నాలుగుశాతం మంది హిందువులు ఉన్నారు.  అయినా.. క‌ష్ట‌కాలంలో పాకిస్తాన్ ప్ర‌భుత్వం తీవ్ర వివ‌క్ష చూప‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. * నా కొడుకు రిక్షా న‌డుపుతాడు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో అన్నీ బంద్ అయ్యాయి. నా కొడుకు కూడా ఇంటి వ‌ద్ద‌నే ఉంటున్నాడు. తిన‌డానికి ఏమీ లేవు. చేతిలో డ‌బ్బులు లేవు. రేష‌న్ షాపుల వ‌ద్ద‌కు పోయిన‌ప్పుడు మీకు ప్ర‌త్యేకంగా ట్ర‌క్కులో నిత్యావ‌స‌ర స‌రుకులు పంపిస్తామ‌ని అధికారులు చెబుతారు. కానీ.. వాళ్లు పంపించ‌రు. వారం రోజులుగా బియ్యం లేవు* ఓ హిందువు క‌న్నీటిప‌ర్యంతం కావ‌డం ప్ర‌పంచ వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. త‌మ ప‌ట్ల తీవ్ర వివ‌క్ష చూపుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.  పాకిస్తాన్ మైనారిటీలు తీవ్ర‌మైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నార‌ని, వారిని ఆదుకోవ‌డాని భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ముందుకు రావాల‌ని, అవ‌స‌ర‌మైన స‌రుకుల‌ను పంపిచాల‌ని అమ్జ‌జ్ ఆయూబ్ మిర్జా అనే ఓ రాజ‌కీయ కార్య‌క‌ర్త కోర‌డం గ‌మ‌నార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: