తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా చాప‌కింద నీరులా విస్త‌రిస్తోంది. ముఖ్యంగా ఏపీలో ప‌రిస్థితి ఒక్క‌సారిగా మారిపోయింది. నిన్న‌టి వరకూ కరోనా ప్రభావం పెద్దగా కనిపించని ఏపీకి ఢిల్లీ మత సమావేశం ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. విదేశాల నుంచి వచ్చిన వారితో పోలిస్తే.. మార్చి 13 నుంచి 15 వరకు ఢిల్లీ నిజాముద్దీన్‌ మార్కెట్‌లో నిర్వహించిన తబ్లీఘీ జమాత్‌కు హాజరై వచ్చిన వారితోనే ఎక్కువ ఆందోళన నెలకొంది. వివిధ దేశాల నుంచి వచ్చిన వారిలో కన్నా.. జమాత్‌కు హాజరై వచ్చిన వారిలోనే కరోనా కేసులు ఎక్కువ వెలుగు చూ స్తుండటం ఇందుకు కారణం.  దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా  87కు చేరుకుంది. గత రాత్రి 9 గంటల నుంచి నేటి ఉదయం 9 గంటల వరకూ 43 పాజిటివ్ కేసులు నమోదు కావడం భ‌యాందోళ‌కు గురి చేస్తుంది.

 

ఏపీలో 11 జిల్లాలకు కరోనా వైరస్‌ పాకింది. మొత్తం 373 మందికి పరీక్షలు నిర్వహించగా 43 మందికి పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. మిగిలిన 330 కేసులు నెగిటివ్ అని రిపోర్టు వచ్చింది. కొత్తగా ఇవ్వాళ అత్యధికంగా కడపలో 15 కేసులు నమోదయ్యాయి. అలాగే పశ్చిమ గోదావరిలో 13 కేసులు, చిత్తూరులో 5, ప్రకాశం 4, నెల్లూరు 2, తూర్పు గోదావరిలో 2, కృష్ణా 1, విశాఖ 1 కేసు.. మొత్తంగా నేడు ఒక్కరోజే 43 కేసులు నమోదవ‌డం గ‌మ‌నార్హం.  ప్రస్తుతానికి ఏపీలో నలుగురు కరోనా నుంచి కోలు కున్నట్టు అధికారులు వెల్లడించారు. ఏపీలో కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండటంతో ప్ర‌భుత్వం అప్ర‌మ త్త‌మైంది.  ఈమేర‌కు సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తున్నారు. పెన్షన్ పంపిణీతో పాటు రెండో విడత ఇంటింటి సర్వేపై చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. లాక్‌డౌన్‌ను మ‌రింత క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. ఇంకా కేసుల సంఖ్య పెరిగితే తీసుకోవాల్సిన చ‌ర్య‌లు, పాటించాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై ముఖ్య‌మంత్రి త‌ర్జ‌న‌బ‌ర్జ‌న ప‌డుతున్న‌ట్లు స‌మాచారం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: