అసెంబ్లీలో అడుగుపెట్ట‌కుండా ఏడాదికిపైగా ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర చేప‌ట్టి.. ఎన్నిక‌ల్లో అద్భుత విజ‌యాన్ని అందుకున్న వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ముఖ్య‌మంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇక ఆ త‌ర్వాత స‌మీక్ష‌ల మీద స‌మీక్ష‌లు చేస్తున్నారు. ప్ర‌జాస‌మ‌స్య‌ల మీద‌కంటే.. ఉనికిపాట్లు పడుతున్న‌ ప్ర‌తిప‌క్ష టీడీపీపై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌, ఆయ‌న టీమ్ ఎక్కువ‌గా దృష్టిపెడుతున్నార‌నే టాక్ ఉంది. పాతిక‌మంది మంత్రులు, అందులోనూ హేమాహేమీలైన ఫైర్‌బ్రాండ్లది కూడా ఇదే ప‌రిస్థితి. కొద్దిరోజులుగా క‌రోనా వైర‌స్ క‌ల‌క‌లం రేపుతున్న విష‌యం తెలిసిందే. అది ఏపీపై కూడా క్ర‌మంగా ప్ర‌భావం చూపుతోంది. ఇక ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని మ‌ర్క‌జ్ ఉదంతం త‌ర్వాత ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. ఏపీ నుంచి కూడా మ‌ర్క‌జ్‌కు వంద‌ల సంఖ్య‌లో ముస్లింలు వెళ్లారు. వీరిలో చాలామందికి క‌రోనా పాజిటివ్ అని తేలింది. అయినా.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌గానీ.. మంత్రులుగానీ.. ఫైర్ బ్రాండ్లుగానీ.. పెద్ద‌గా ప‌ట్టించుకుంటున్న‌ట్లు అనిపించ‌డం లేదు. ఎలాంటి ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు కూడా క‌నిపించ‌డం లేదనే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

 

క‌రోనా వైర‌స్ ప్ర‌భావాన్ని అంచ‌నా వేయ‌కుండా.. తేలిగ్గా తీసుకున్నారు. క‌నీసం క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై ప్ర‌జ‌ల‌కు ముంద‌స్తుగా అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్న విష‌యాన్ని కూడా మ‌రిచిపోయారు. చూస్తుండ‌గానే ప‌రిస్థితి చేజారిపోయింది. మ‌ర్క‌జ్ ఉదంతంతో ఒక్క‌సారిగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతంగా పెరుగుతుండ‌డంతో ప్ర‌జ‌ల్లో తీవ్ర భయాందోళ‌న‌లు నెల‌కొన్నాయి. ఏపీ నుంచి ఇత‌ర ప్రాంతాల‌కు వ‌ల‌స‌వెళ్లిన కూలీల ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా మారుతోంది. ఇదే స‌మ‌యంలో ఇత‌ర రాష్ట్రాల నుంచి ఏపీకి వ‌ల‌స వ‌చ్చిన కార్మికులు, కూలీల‌కు భ‌రోసా కూడా ఇవ్వ‌లేని పరిస్థితి. మొత్తంగా ప‌రిస్థితి చేజారిపోతున్న వేళ  సీఎం జ‌గ‌న్‌, మంత్రులు మేల్కొంటున్నార‌నే టాక్ వినిపిస్తోంది. నిజానికి.. ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న‌ప్పుడు జ‌గ‌న్ ప్ర‌జాస‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ ఏడాదికిపైగా పాద‌యాత్ర చేప‌ట్టారు. అసెంబ్లీకి కూడా వెళ్ల‌లేదు. కానీ.. ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత ప్ర‌జ‌ల్లోకి రావ‌డాన్ని జ‌గ‌న్ మ‌రిచిపోయార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. జ‌గ‌న‌న్నా.. ఇప్పుడన్నా జ‌నాల్లోకి రావాల‌న్నా.. అంటూ సూచిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: