కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ గడచిన 24 గంటల్లో 386 కొత్త కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇంత భారీ సంఖ్యలో గతంలో ఎప్పుడూ కేసులు నమోదు కాలేదని బాధితుల సంఖ్య 1637కు చేరిందని చెప్పారు. నిన్న ముగ్గురు బాధితులు చికిత్స పొందుతూ మృతి చెందారని ప్రకటన చేశారు. కరోనా మహమ్మారిని నివారించడంతో రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కేంద్రానికి సహకరిస్తున్నాయని అన్నారు. 
 
ఈరోజు మీడియా సమావేశంలో లవ్ అగర్వాల్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు. ప్రజలెవరూ అనవసరంగా భయాందోళనకు గురి కావద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా ప్రభుత్వ సూచనలను పాటించాలని కోరారు. ఐసోలేషన్ పడకల కోసం 5 వేల రైల్వే కోచ్ లను ఆధునీకరించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలు కీలక శాఖల ఉన్నతాధికారులు మీడియాతో మాట్లాడారు. 
 
నిజాముద్దీన్  మర్కజ్ కార్యక్రమానికి హాజరైన వారిలో 1800 మందిని క్వారంటైన్ కేంద్రాల్లో, ఆస్పత్రుల్లో చేర్పించినట్లు తెలిపారు. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 47,951 మందికి పరీక్షలు జరిగాయని... ఐ.సీ.ఎం.ఆర్. నెట్ వర్క్ కింద 126 లేబొరేటరీల్లో పరీక్షలు జరుగుతున్నాయని... కొత్తగా 51 ప్రైవేట్ లేబొరేటరీలకు అనుమతులు జారీ చేశామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే వలస కూలీల కోసం ఏర్పాట్లు చేశాయని అన్నారు. 
 
6,75,133 మందికి వసతి కల్పించామని...వారి కోసం 21,486 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశామని అన్నారు. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకూ 97 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఏపీలో 87 కేసులు నమోదయ్యాయి. ఈరోజు రాత్రి హెల్త్ బులెటిన్ విడుదలయ్యాక పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: