తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి విష‌యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఒకింత యుద్ధ ప్రాతిప‌దిక‌న ప‌నిచేస్తున్న సంగ‌తి తెలిసిందే. అధికారుల‌ను ఉరుకులు ప‌రుగులు పెట్టించ‌డం, మార్గ‌ద‌ర్శ‌కాలు ఇవ్వ‌డం వంటి చ‌ర్య‌ల‌తో పాటుగా ఊహించ‌ని రీతిలో ఉద్యోగులు వేత‌నాల్లో సైతం కోత విధించారు. దీనిపై వివిధ వ‌ర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే, బీజేపీకి చెందిన మాజీ మంత్రి, ఫైర్‌బ్రాండ్ నాయ‌కురాలు డీకే అరుణ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. కరోనా కోసం ఎన్ని వేల కోట్లు అయినా  ఖర్చు పెడుతానన్న కేసీఆర్ ఇప్పుడు ఎందుకు ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను కట్ చేస్తున్నారు అని అరుణ నిల‌దీశారు.

 


ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఐఆర్, పీఆర్సీ ఇవ్వకుండా వేతనాలను 50 శాతం కోత విధించడం ఏమిటని డీకే అరుణ ప్ర‌శ్నించారు. స్వయంగా ప్రధానమంత్రి, లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ప్రైవేట్ ఉద్యోగస్తుల, కార్మికులకు పూర్తి వేతనాలు చెల్లించాలని చెప్పారని డీకే అరుణ గుర్తు చేశారు. ``వేతనంపై ఆధారపడి బ్రతికే ఉద్యోగుల వేతనాల్లో ఏక పక్షంగా 50 శాతం కోత విధిస్తే కుటుంబాల జీవన పరిస్థితి అస్తవ్యస్థం అవుతుంది. మీరు తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణ ప్రజలు భయబ్రాంతులకు గురి అవుతున్నారు. కరోనాపై ప్రతి రోజు పోరాడుతున్న ఉద్యోగులకు మీరిచ్చే బహుమానం ఇదేనా? ధనిక రాష్ట్రం అని పదే పదే చెప్పుకునే కేసీఆర్ ఇప్పుడు ఆర్థిక లోటు అనటం విడ్డురంగా ఉంది. కేసీఆర్‌...మీ అనాలోచిత నిర్ణయాల వల్లే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఇలా తయారు అయింది.`` అని అరుణ మండిప‌డ్డారు. 

 


కేవలం వారం రోజులు మధ్యం దుకాణాలు బంద్ చేస్తే రాష్ట్రంలో ఆర్థిక లోటు వచ్చిందా అని అరుణ ప్ర‌శ్నించారు. ``రాష్ట్రంలో వారం రోజుల లాక్ డౌన్‌కే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఎలా? ఇక ముందు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు..మరి వాటిని ఎలా ఎదుర్కుంటారు? దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ ఏర్పడి ఆర్టికల్ 360 అమల్లోకి వచ్చినప్పుడు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధించేందుకు అవకాశం ఉటుంది. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితి దేశంలోనే లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు మీరు ఇలాంటి కోతలు విధించి సమాజానికి ఎలాంటి సంకేతాలు పంపుతున్నారు? ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ కోత విధించారు మీకు ఎలా వేతనాలు ఇవ్వాలని ప్రవేట్ ఉద్యోగులను ఆయా యాజమాన్యాలు అంటే ఎవరు బాధ్యత వహిస్తారు? వెంటనే ఉద్యోగుల వేతనాల కోతను ముఖ్యమంత్రి కేసీఆర్ వెనక్కి తీసుకోవాలి. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితుల పైన ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగైదు రోజుల్లో శ్వేతపత్రం విడుదల చేయాలి` అని డీకే అరుణ డిమాండ్ చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: