తెలంగాణ లో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదయి నెల రోజులు కావస్తోంది . ఈ నెల రోజుల నుంచి రాష్ట్ర ప్రజలను , ప్రధానంగా హైదరాబాద్ నగరవాసులను  కరోనా భయం వెంటాడుతోంది . మార్చి రెండవ తేదీన దుబాయి నుంచి వచ్చిన ఒక వ్యక్తికి  కరోనా పాజిటివ్ అని తేలడం తో ఒక్కసారిగా   అటు ప్రభుత్వం , ఇటు ప్రజలు  అప్రమత్తమయ్యారు . ఆ తరువాత మరో కేసు నమోదు కావడానికి 12 రోజుల సమయం పడితే , ఆ తరువాత మాత్రం శరవేగంగా కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తోంది . అప్పటి వరకు హైదరాబాద్ కే పరిమితమైన కరోనా బాధితుల సంఖ్య  మార్చి 18  న కరీంనగర్ కు విస్తరించింది .

 

 ఒక మత ప్రచార నిమిత్తం  ఇండోనేషియా నుంచి వచ్చిన వారి వల్ల స్థానికులకు కూడా కరోనా వైరస్ సోకడంతో , ప్రభుత్వం అప్రమత్తమైంది . వ్యాధి విస్తృతిని అడ్డుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది .  ఇక ఢిల్లీ లోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదు లో జరిగిన ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన వారితో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడమే కాకుండా , ఈ ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన ఆరు మంది వేర్వేరు ప్రాంతాల్లో మృత్యువాత పడ్డారు . దీనితో మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన వారిని ట్రేస్ చేసే ప్రయత్నాలను ప్రభుత్వం  చేపట్టింది . తెలంగాణ నుంచి ఈ ప్రార్థనల్లో దాదాపు వెయ్యి మందికిపైగా పాల్గొన్నట్లు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగం లోకి దించింది .

 

ఇప్పటికే మెజార్టీ సంఖ్య లో ప్రార్థనల్లో పాల్గొన్నవారిని ట్రేస్ చేసిన ప్రత్యేక బృందాలు , పాజిటివ్ గా తేలిన వారిని ఐసోలేషన్ కు తరలించి వారి కుటుంబ సభ్యులకు కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు . గత నెల రోజులుగా తెలంగాణ లో 97 కరోనా కేసులు నమోదు కాగా , వారిలో 14 మంది వైరస్ నుంచి విముక్తి పొంది డిశ్చార్జ్ అయ్యారు . ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ లో కరోనా వ్యాప్తి నియంత్రణలో ఉన్నప్పటికీ , రానున్న రోజుల్లో పరిస్థితి ఏమిటన్నదే అంతుచిక్కడం లేదు .     

మరింత సమాచారం తెలుసుకోండి: