క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో...ఈఎంఐల‌పై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) మారటోరియం విధించిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ విష‌యంలో బ్యాంకులు స్ప‌ష్ట‌త‌ను ఇవ్వ‌లేదు. దీంతో క‌స్ట‌మ‌ర్లు కంగారు ప‌డిపోయారు. తాజాగా sbi కస్టమర్లకు శుభవార్త వెలువ‌డింది. ఈఎంఐలు ఆటోమేటిక్ గా వాయిదా ప‌డుతాయ‌ని నిర్ణ‌యం తీసుకుంది.  కస్టమర్లు దీని కోసం ప్రత్యేకంగా అప్లయ్ చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. హోంలోన్స్, కార్ లోన్స్, పర్సనల్ లోన్స్ లేదా టెర్మ్ లోన్ల ఈఎంఐలు మూడు నెలల పాటు వాయిదా పడతాయని,  ఆర్బీఐ ఇచ్చిన మూడు నెలల మారటోరియంలో భాగంగా ఈఎంఐలు ఆటోమెటిక్ గా వాయిదాపడతాయని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ అన్నారు.

 

కాగా,  మార్చి 1 నుంచి మే 31 వరకున్న రుణాల ఈఎంఐలు, వడ్డీరేట్ల బకాయిలను వాయిదా వేసుకోవచ్చని ఎస్బీఐ, బీవోబీ, పీఎన్‌బీ, కెనరా బ్యాంక్‌లు తమ ఖాతాదారులకు తెలియజేశాయి. రీపేమెంట్‌ వ్యవధిని మూడు నెలలు పొడిగించామని ఎస్బీఐ ఈ సందర్భంగా ప్రకటించింది. ఈ మేరకు ఖాతాలకు అనుసంధానంగా ఉన్న మొబైల్‌ నెంబర్లకు, ఈ-మెయిల్‌ అడ్రస్‌లకూ మెసేజ్‌లు పంపుతున్నట్లు బ్యాంకర్లు తెలిపారు.  మారటోరియంతోపాటు రిజర్వ్‌ బ్యాంక్‌ తీసుకున్న ఇతర నిర్ణయాల ప్రయోజనాలను ఎలా? పొందవచ్చు అన్నది సవివరంగా సందేశాల ద్వారా తెలియజేస్తున్నామని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎండీ రాజ్‌కిరణ్‌ రాయ్‌ జీ పీటీఐకి తెలిపారు. కరోనా వైరస్‌తో ఆదాయం కోల్పోయినవారే మారటోరియంను ఎంచుకోవడం ఉత్తమమని రాయ్‌ అన్నారు. ఎప్పట్లాగే ఆదాయం ఉన్నవారు ఈఎంఐలను కొనసాగించాలని సూచించారు.

 


కాగా, కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ నేపథ్యంలో రుణగ్రహీతలకు ఊరటనిస్తూ ఆర్బీఐ మారటోరియం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ మారటోరియం తీసుకుంటే లాభమా.. నష్టమా.. అన్నదానిపై స్పష్టత లేకపోవడంతో రుణగ్రహీతల్లో అయోమయం నెలకొన్నది. ఖాతాల నుంచి ఈఎంఐ సొమ్మును కత్తిరించే సమయం దగ్గరపడుతున్నా సందిగ్ధత కొనసాగుతున్న క్రమంలో బ్యాంకర్లు కస్టమర్ల సందేహాలను నివృత్తిచేస్తూ తాజాగా ప్రకటనలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: