క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ర్టాల ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సైతం అన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ దీని విస్తృతి ఆగటంలేదు. దీంతో దేశమంతటా లాక్‌డౌన్‌ ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. ఆ తర్వాత కూడా కరోనా వ్యాప్తి పూర్తిగా కట్టడి కావడంలేదు. మంగ‌ళ‌వారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. అయితే, అస‌లు టెన్ష‌న్ రెండు దశలు దాటి రాగలిగిన కరోనా రక్కసిని.. మలిదశలోకి అడుగుపెట్టనివ్వకుండా పూర్తిస్థాయిలో అడ్డుకోవడం. ఈ విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం అల‌ర్ట్‌గా ఉంద‌ని తెలుస్తోంది. 

 

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలెవ్వరినీ బయటకు రానివ్వకుండా లాక్‌డౌన్‌ అమలుచేస్తూనే.. ప్రత్యేక బృందాల ద్వారా విదేశాల నుంచి వచ్చిన వారి కదలికలను పక్కాగా ట్రాక్‌చేస్తున్నారు. వారు రాష్ట్రంలో అడుగుపెట్టినప్పటినుంచి ఎక్కడెక్కడ తిరిగారు? ఎవరెవరిని కలిశారు? ఏం చేశారు?.. ఇలా ప్రతి చిన్న విషయాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తూ అనుమానితులను క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. ఎట్టి  పరిస్థితుల్లోనూ కరోనా మూడో దశకు చేరకుండా కట్టుదిట్టంగా చర్యలు తీసుకొంటున్నారు.

 

విదేశాలనుంచి వచ్చినవారు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి రిపోర్ట్‌ చేయాలని ఇప్పటికే పిలుపునిచ్చిన ప్రభుత్వం, ఒకవేళ తెలియజేయకపోతే కేసులు పెట్టడానికి కూడా సిద్ధమైనట్టు సమాచారం. కొవిడ్‌ నియంత్రణ చర్యల్లో ప్రధాన భూమిక నిర్వహిస్తున్న వైద్యారోగ్యశాఖ సిబ్బంది సెలవులను పూర్తిగా రద్దుచేశారు. వారికి కావాల్సిన  కరోనా కిట్లు, వెంటిలేటర్లు, వైద్య పరీక్షలకు సంబంధించిన అన్ని పరికరాలను నిధులకు వెనుకాడకుండా అందుబాటులో ఉంచారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటుచేసి అనుమానితులకు  తరలిస్తున్నారు. వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వైద్యులు, వైద్య నిపుణులతోనే గడుపుతూ సీఎం కేసీఆర్‌ మార్గదర్శనంలో కరోనా మూడో దశలోకి అడుగుపెట్టకుండా కచ్చితమైన, నిర్బంధమైన చర్యలు తీసుకొంటున్నారు. కాగా, కొవిడ్‌-19 వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరిగితే చికిత్సచేయడం కోసం హైదరాబాద్‌ గాంధీ దవాఖానను పూర్తిస్థాయి కరోనా హాస్పిటల్‌గా మార్చడానికి ఏర్పాట్లు చేసింది. కింగ్‌కోఠి వైద్యశాలను కూడా పూర్తిస్థాయిలో కరోనాకు వైద్యం చేసేలా మార్చడానికి ఆదేశాలు జారీ అయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: