అశేష భక్తజనం లేకుండానే భద్రాచల శ్రీ రాముడి కల్యాణం జరిగిపోయింది. భద్రచాలంలో శ్రీరాముడి ఆలయం నిర్మించిన దగ్గర నుండి భక్తజనం లేకుండా కల్యాణం జరగటం బహుశా ఇదే మొదటిసారేమో. కరోనా వైరస్ దెబ్బకు భక్త జనాలు ఎక్కడివారక్కడే నిలిచిపోవటంతో పాటు ప్రభుత్వాలు లాక్ డౌన్ ను చాలా గట్టిగా అమలు చేస్తుండటంతో రవాణా సౌకర్యాలు కూడా ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. దాంతో  భక్తులు హాజరుకాకుండానే శ్రీ సీతారాముల కల్యాణం జరిగిపోయింది. కడప జిల్లాలోని ఒంటిమిట్ట ఆలయంలో కూడా ఇదే పరిస్ధితి లేండి.

 

భద్రాచలం శ్రీ సీతారాముల దేవాలంలో ప్రతిఏటా శ్రీరామనవమి సందర్భంగా జరిగే కల్యాణం ఏ స్ధాయిలో జరుగుతుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.  కల్యాణమంటే సీతారాములదే అనిపించేట్లుగా కళ్ళు మిరుమిట్లు గొలిపే రీతిలో  ప్రతి ఏడు వివాహం జరుగుతుంది. కల్యాణానికి ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్ తో పాటు ఉభయగోదావరి జిల్లాలు, ఖమ్మం జిల్లాల నుండి లక్షల సంఖ్యలో భక్తులు హాజరయ్యే విషయం అందరికీ తెలిసిందే.

 

అలాంటి భద్రాచల రాముడి వివాహానికి కరోనా వైరస్ దెబ్బ బాగా కొట్టేసింది. అందుకనే ఈ కల్యాణ మహోత్సవంలో హాజరయ్యేందుకు ప్రభుత్వం కేవలం 40 మంది వివిఐపిలను మాత్రమే అనుమతించినట్లు సమాచారం. సరే ఎలాగూ ఆలయం అధికారులు, సిబ్బంది, పురోహితులు, పూజారులు ఉండనే ఉంటారు లేండి.  లక్షలమంది కూర్చునే ప్రాంగణంలో మొత్తం మీద 100 మంది సమక్షంలోనే భద్రాచల రాముడి కల్యాణం జరిగిపోయిందంటే అక్కడి వాతావరణం ఎలాగుందో అంచనా వేసుకోవచ్చు.

 

ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరయ్యారు. వీళ్ళతో పాటు కొందరు ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధుల్లో కూడా కొందరిని మాత్రమే అనుమతించారు.  కారణమేదైనా చరిత్రలోనే భక్తులు లేకుండా శ్రీ సీతారాముల కల్యాణం జరగటం మాత్రం ఇదే మొదటిసారి. భక్తుల తాకిడి లేదు కాబట్టే కల్యాణం ఏర్పాట్లతో పాటు కల్యాణం కూడా కన్నుల పండువుగా జరిగింది. మామూలుగా లక్షల్లో భక్తులు హాజరైనపుడు ఇంత ప్రశాంతంగా కల్యాణం జరగటాన్ని ఎవరూ చూసుండరు.

మరింత సమాచారం తెలుసుకోండి: