రాష్ట్రంలో గత మూడు రోజుల నుంచి కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న విషయం విదితమే. ఈరోజు 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కరోనా బాధితుల సంఖ్య 132కు చేరింది. కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలు నిన్నటినుండి మరింత కఠినంగా అమలవుతున్నాయి. ఏపీ ప్రభుత్వం కొత్త కేసులు నమోదు కాకుండా మరిన్ని కొత్త నిర్ణయాలను అమలు చేయనుందని తెలుస్తోంది. 
 
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ విద్యుత్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మార్చి నెల బిల్లుల విషయంలో శుభవార్త చెప్పింది. ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ జె.పద్మ జనార్దనరెడ్డి మీడియాకు ఫిబ్రవరి నెలలో ఎంత కరెంట్ బిల్లు చెల్లించారో అంతే మొత్తాన్ని మార్చి నెలకు కూడా చెల్లించాలని సూచించారు. వచ్చే నెలలో విద్యుత్ వినియోగంలో హెచ్చుతగ్గులను సర్దుబాటు చేస్తామని తెలిపారు. 
 
ప్రజలు విద్యుత్ బిల్లుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారని... రాష్ట్రంలో 24 గంటలు విద్యుత్ సరఫరా అయ్యే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. విద్యుత్ కు సంబంధించిన సమస్యలు ఉంటే 1912 నంబర్ కు కాల్ చేసి చెప్పాలని సూచించారు. లాక్ డౌన్ సమయంలో నిరంతర విద్యుత్ సరఫరాకు సహకరిస్తున్న ఉద్యోగులకు, వినియోగదారులకు అభినందనలు తెలిపారు. 
 
ఉద్యోగులు, వినియోగదారులు రాష్ట్రంలో కరోనాను పూర్తి స్థాయిలో నియంత్రించేంత వరకు ఇదే సహకారం అందించాలని కోరారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితమై సురక్షితంగా ఉండాలని చెప్పారు. రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలు గత నెలలో ఎంత మొత్తం చెల్లించారో అంతే మొత్తం ఈ నెల చెల్లించాల్సి ఉంటుంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వినియోగదారులు ఆన్ లైన్ ద్వారా బిల్లులను చెల్లించాలని విద్యుత్ శాఖ అధికారులు సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: