లాక్‌డౌన్ క‌ష్టాల తీవ్రత పెరుగుతోంది. అత్య‌వ‌స‌ర సేవ‌ల విష‌యంలోనూ ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. ముఖ్యంగా కీల‌క‌మైన మందుల విష‌యంలో ఇబ్బందులు త‌లెత్తుతున్నాయి. అత్య‌వ‌స‌ర మందుల‌కు సైతం రోగులు తీవ్ర‌మైన అవ‌స్థ‌లు ప‌డాల్సి వ‌స్తోంది. మ‌రోవైపు వ్యాపార సంస్థ‌లు సైతం ఆందోళ‌న చెందుతున్నాయి. ఈ–ఫార్మసీ సంస్థ‌లైన 1ఎంజీ, మెడ్‌లైఫ్‌, నెట్‌మెడ్స్,  ప్రాక్టో, మై ఉపచార్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ త‌మ ఆవేద‌న వ్య‌క్తం చేశాయి. పెద్ద ఎత్తున ఆర్డర్లు వ‌స్తున్న‌ప్ప‌టికీ...డెలివరీలలో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నాయి.

 

ఆర్డర్లు డబుల్‌ అయ్యాయి కానీ కేవలం50 శాతం డెలివరీలను మాత్రం ఆన్‌‌టైమ్‌‌లో చేయగలుగుతున్నామని ఆయా సంస్థ‌లు పేర్కొంటున్నాయి. సుమారు 20–30 శాతం మేర మాత్రమే డెలివరీ వర్క్‌ఫోర్స్‌ అందుబాటులో ఉందని... ఇబ్బంది పెడుతున్న స్టాఫ్‌‌ కొరతతో మెట్రో సిటీలలో మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నామని తెలుపుతున్నారు. డెలివరీ చేసే వారు తిరిగి విధుల్లో జాయిన్‌‌ అయితే నాన్‌‌ మెట్రోలలో కూడా తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు.

 


కాగా, నిత్యావసర వస్తువులు అమ్మే గ్రోసరీ స్టోర్స్‌ను మూసివేయడం వల్ల ప్రజలకు కలిగే ఇబ్బందులను వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాల‌ని, అందుకే తెరచి ఉంచడానికి అంగీకరించాల‌ని రిటైలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌ఏఐ) కోరుతోంది. నిత్యావ‌స‌ర స‌రుకుల దుకాణాల‌ను మూసి వేస్తే ప్రజలు ఒకేసారి ఎక్కువ సరుకులు కొంటారని, తద్వారా కొరత ఏర్పడుతుందని కూడా పేర్కొంది. ప్రజలకు సేవలు అందించేందుకు రిటైల్‌ రంగంలోని ఉద్యోగులు తమ జీవితాలను పణంగా పెడుతున్నారని తెలిపింది. మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్‌, ఉత్తర ప్రదేశ్‌, పంజాబ్‌, గుజరాత్‌ రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలో పోలీసులు ఫుడ్‌, గ్రోసరీ స్టోర్ల ఉద్యోగులను, డెలివరీ స్టాఫ్‌ను కొట్టడంతోపాటు, పోలీసు స్టేషన్‌లకు తీసుకెళ్లిన నేపథ్యంలో  ఈ విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆర్‌ఏఐ తెలిపింది. ప్రజలు బయటకు రాకుండా చూసేందుకు హోమ్‌ డెలివరీ మెకానిజం సాయపడుతుందని, కాబట్టి దానిని అనుమతించాలని కోరింది. ఫుడ్‌, గ్రోసరీ స్టోర్స్‌ చిన్నవైనా, పెద్దవైనా సరే తెరిచి ఉంచేలా చూడాలని పిలుపు ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: