కరోనా అత్యవసర పరిస్థితి కారణంగా బ్యాంకు లోన్ల రీపేమెంట్‌, ఈఎంఐలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మూడు నెలల 
మారటోరియం విధించటం తెలిసిన సంగ‌తే. ఈ సంక్షోభం నుంచి సామాన్యులకు ఊరట కల్పించేలా అన్ని రకాల టర్మ్‌ లోన్లకు సంబంధించిన ఈఎంఐల చెల్లింపులపై మూడునెలలపాటు మారటోరియం విధించేందుకు బ్యాంకులకు, ఇతర ఆర్థిక సంస్థలకు ఆర్‌బీఐ అనుమతి ఇచ్చింది. దీనివల్ల రుణగ్రహీతల క్రెడిట్‌ హిస్టరీపై ప్రతికూల ప్రభావమేమీ ఉండదని హామీ ఇచ్చింది. అయితే, ఇక్క‌డే అస‌లు తిర‌కాసు తెర‌మీద‌కు వ‌స్తోంది. ఆర్‌బీఐ నిర్ణ‌యంతో మార్చి 1 నుంచి మే 31 వరకు ఉన్న కాలానికి సంబంధించిన ఈఎంఐలను వాయిదా వేసుకోవచ్చు. అంటే ఏప్రిల్‌, మే, జూన్‌ ఈఎంఐ చెల్లింపులకు దూరంగా ఉండొచ్చు. అయితే ఈఎంఐలను వాయిదా వేసుకోవడం వల్ల రుణగ్రహీతలకు లాభమేమీ ఉండదని బ్యాంకర్లు అంటున్నారు. 

 


ఔనండి. ఈ మూడు నెలలు ఈఎంఐలు చెల్లించకపోతే ఆ తర్వాత వడ్డీతోసహా కట్టాల్సి ఉంటుందని తేల్చి చెప్తున్నారు. మారటోరియం వ్యవధి ముగిసిన తర్వాత ఈ మూడు నెలల విరామ కాలానికి వడ్డీ లెక్కించి వేస్తామని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్బీఐ స్పష్టం చేసింది. మారటోరియం తీసుకున్న కస్టమర్ల నుంచి ఈ వడ్డీని అదనపు ఈఎంఐల ద్వారా వసూలు చేస్తామని వెల్లడించింది. కాబట్టి నగదు కొరత లేనివారు మారటోరియానికి దూరంగా ఉండటమే ఉత్తమమని బ్యాంకులు చెప్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఇదే సూచిస్తున్నది. అదనపు వడ్డీ భారాన్ని, రుణ కాలపరిమితి పొడిగింపు నుంచి తప్పించుకోవాలని హితవు పలికింది. కాగా, కరోనా కారణంగా తమ ఆదాయం దెబ్బతిన్నవారే మారటోరియంను తీసుకోవాలని భారతీయ బ్యాంకింగ్‌ సంఘం రుణగ్రహీతలకు సూచించింది.

 


మారటోరియం కావాలనుకునే రుణగ్రహీతలు తమతమ బ్రాంచీలకు సమాచారం ఇవ్వాలని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు. నేషనల్‌ ఆటోమేటెడ్‌ క్లియరింగ్‌ హౌజ్‌ (ఎన్‌ఏసీహెచ్‌) ద్వారా ఈఎంఐలను చెల్లిస్తున్నవారు ఎన్‌ఏసీహెచ్‌ నిలుపుదలకు, పొడిగింపు కోసం ఈ-మెయిల్‌ ద్వారా సూచించిన బ్యాంక్‌ ఈ-మెయిల్‌ ఐడీకి సందేశం ఇవ్వాలని ఎస్బీఐ తమ కస్టమర్లను కోరింది. ఎస్బీఐ వెబ్‌సైట్‌లో అన్ని సర్కిళ్లకు సంబంధించిన ఈ-మెయిల్‌ ఐడీలు ఉంటాయని చెప్పింది. అలాగే మారటోరియం వద్దనుకుని యథాతథంగా ఈఎంఐలు చెల్లించాలనుకునేవారికి దీంతో పనిలేని స్పష్టం చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కూడా తమ వెబ్‌సైట్‌ హోం పేజీల్లో కస్టమర్ల కోసం మారటోరియం ఆప్షన్లను అందుబాటులో ఉంచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: