అధ్యక్షుడు నిర్ణయం తప్ప ఏ ఒక్కరూ నోరు మెదపడం కానీ, ధిక్కార స్వరాలు వినిపించేందుకు కానీ అవకాశం ఉండని పార్టీ ఏదైనా ఉందా అంటే అది ఖచ్చితంగా ఏపీ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఆ పార్టీలో అధ్యక్షుడు జగన్ తప్ప ఇంకెవరు నోరెత్తే అవకాశమే లేదు. ఏ నిర్ణయమైనా పార్టీ శ్రేయస్సు దృష్ట్యా జగన్ మాత్రమే తీసుకుంటూ ఉంటారు. దాని వెనుక ఆయన ఎన్నో సమీకరణాలు, లెక్కలు వేసుకుని మరి ముందుకు వెళ్తుంటారు. ప్రభుత్వంలోనూ జగన్ మాటే ఫైనల్ అన్నట్టుగా వ్యవహారాలు చోటు చేసుకుంటూనే ఉన్నా, ప్రస్తుతం వైసీపీలో జగన్ నిర్ణయాలపై గుర్రుగా ఉన్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు అనేక ఇబ్బందులను ఎదుర్కొంది. గత టిడిపి ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలను టార్గెట్ చేసుకుంటూ ఎన్నో వేధింపులకు పాల్పడ్డారు. సామాజికంగా ఆర్థికంగా వైసీపీ నాయకులు ఎన్నో కష్టాలను అనుభవించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నుంచి వైసీపీలోకి పెద్ద ఎత్తున వలస వచ్చేందుకు సిద్ధం అయినా, జగన్ మాత్రం వారి రాకకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. 

 


వారంతా పార్టీలోకి వస్తే అనవసర గ్రూపు తగాదాలు ఏర్పడతాయనే ఉద్దేశంతో చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఆ తరువాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొద్దిమంది నేతలు మాత్రమే పార్టీలో చేరేందుకు అవకాశం కల్పించారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జగన్ నియోజకవర్గ స్థాయి నాయకులు టిడిపి నుంచి భారీగానే వలసలు వైసీపీ లోకి వచ్చాయి. అయితే అకస్మాత్తుగా చేరికలు వాయిదా పడ్డాయి. దీంతో మిగతా నాయకులూ చేరేందుకు సిద్ధం అయినా వారు వైసీపీ లోకి వచ్చేందుకు కరోనా వైరస్ వ్యవహారం అడ్డుగా మారింది. అది తేలిన తర్వాత వారిని పార్టీలో చేర్చుకోవాలని జగన్ చూస్తున్నారు. ఇప్పటికే కర్నూలు జిల్లాలో పత్తికొండ నియోజకవర్గం లో  కేఈ కుటుంబం నుంచి కేఈ ప్రభాకర్ వైసీపీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన చేరిక కు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే అక్కడ వైసీపీ ఎమ్మెల్యే గా చెరుకువాడ నారాయణ రెడ్డి సతీమణి శ్రీదేవి ఎమ్మెల్యేగా ఉన్నారు. నారాయణ రెడ్డి ని హత్య చేయించింది కేఈ కుటుంబమేనని ఆమె మొదటి నుంచి పోరాడుతున్నారు. దీంతో ఆయన కనుక వైసీపీ లోకి వస్తే శ్రీదేవి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అనే టెన్షన్ జగన్ కు ఉంది.

 

 ఇక చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు కుటుంబం వైసీపీ లోకి వచ్చేందుకు సిద్ధమైనా వారి రాకను నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక జగన్ సొంత ప్రాంతమైన పులివెందుల లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పులివెందులలో దశాబ్దాలుగా వైఎస్ ఫ్యామిలీకి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న సతీష్ రెడ్డి వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన రాకను జగన్ కూడా స్వాగతిస్తున్నా, వైసీపీ శ్రేణులు మాత్రం ససేమీరా అంటున్నాయి. ఎందుకంటే సతీష్ రెడ్డి కుటుంబం జగన్ తాత రాజారెడ్డి హత్య కు కారకులు అనే ఆరోపణలు ఉన్నాయి. అటువంటి కుటుంబం నుంచి సతీష్ రెడ్డిని పార్టీలో చేర్చుకుంటే జగన్ పైన తీవ్ర విమర్శలు వస్తాయని వైసిపి నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రతి జిల్లాలోనూ టిడిపి నుంచి వలస వచ్చే నాయకులను వైసీపీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ జగన్ నిరణయాన్ని వారంతా వ్యతిరేకిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: