చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచదేశాలను ఎంతగా వణికించేస్తోందో అందరూ చూస్తున్నదే. ఈ దేశం ఆ దేశం అని తేడా లేకుండా యావత్ ప్రపంచందేశాలను నానా యాతనలకు గురిచేస్తోంది. ప్రపంచంలోనే అగ్రరాజ్యమని చెప్పుకునే అమెరికా, ఎంతో అభివృద్ధి చెందిన రష్యా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ లాంటి దేశాలే కరోనా దెబ్బకు తల్లక్రిందులైపోతున్నాయి. ఇక భారతదేశం లాంటి వర్ధమాన దేశాల సంగతి చెప్పనే అక్కర్లేదు.

 

ఇటువంటి తీవ్రతలో కూడా కొన్ని దీవుల్లోకి కరోనా వైరస్ అస్సలు అడుగుపెట్టలేకపోతోందట. డిసెంబర్లో పుట్టిన వైరస్  నాలుగు నెలల తర్వాత ఓ ఐదారు దీవుల్లోకి అడుగు పెట్టలేకపోతోందంటే విశేషంగానే చెప్పుకోవాలి. ఇంతకీ ఆ దీవులేమిటో ఓసారి చూద్దాం. ఉత్తర పసిఫిక్ సముద్ర ప్రాంతంలో ఉన్న దీవుల సమూహంలో పలావు దీవి కూడా ఒకటి. ఈ దీవి మొత్తం జనాభా 18 వేలు. దీవిలోని జనాలు రోజు వారి వ్యవహారాలు సజావుగా చేసుకుంటునే ఉన్నా వైరస్ ప్రభావం వాళ్ళపైన పడలేదట.

 

విస్తారమైన పసిఫిక్ మహా సముద్రంలో పలావు దీవి ఓ నీటి బిందువు లాగుంటుంది. అలాగే దీంతో పాటు టోంగా, సాలమన్ దీవులు, మార్షల్ దీవులు, మైక్రోనేషియాతో పాటు మరికొన్ని దీవుల్లో ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క వైరస్ కేసు కూడా బయటపడలేదట. ఒకవైపు ప్రపంచాన్నే వణికించేస్తున్న కరోనా మరి ఈ దీవుల్లోకి ఎందుకని అడుగుపెట్టలేకపోతోంది ?

 

ఎందుకంటే ఎప్పుడైతే చైనాలో మొదటి వైరస్ కేసు బయటపడిందో వెంటనే పై దీవుల్లోని జనాలంతా ముందు జాగ్రత్తలు తీసుకున్నారట. బయట ప్రాంతాల నుండి వచ్చే పర్యాటకులకు నో బోర్డు పెట్టేశారు. అసలే పై దీవులు ప్రముఖ పర్యాటక ప్రాంతాలన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే చాలా దేశాలకన్నా ముందుగానే బయట వాళ్ళెవరినీ తమ దీవుల్లోకి అనుమతించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే తాము కూడా సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తున్నారట.

 

ఎప్పుడైతే బయట ప్రపంచంతో సంబంధాలను తెంపేసుకున్నారో, తమలో కూడా సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తున్నారో ఇక కరోనాకు ఆ దీవుల్లోకి ప్రవేశించే అవకాశాలు లేకుండా పోయాయి. చూశారా ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఎంత మంచి జరుగుతుందో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: