కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా ఎంత గందరగోళం రేగుతోందో అందరూ చూస్తున్నదే.  ఈ నేపధ్యంలోనే లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోవటంతో పాటు వైరస్ నియంత్రణకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై మాట్లాడేందుకు ప్రధానమంత్రి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే.  సరే ఈ సందర్భంగా మోడి అడిగేదేదో అడిగారు. ముఖ్యమంత్రులు కూడా వైరస్ వ్యాప్తి నిరోధానాకి తాము తీసుకుంటున్న చర్యలను మోడికి వివరించారు.

 

ఇదంతా బాగానే ఉందికానీ లాక్ డౌన్ విషయంలోనే సిఎంలు ఎక్కువగా ప్రస్తావించారు. లాక్ డౌన్ వల్ల జనాలు పడుతున్న ఇబ్బందులను ప్రధాని దృష్టికి తీసుకెళ్ళారు. కాబట్టి లాక్ డౌన్ ను వెంటనే ఎత్తేయటమో లేకపోతే సడలించటమో చేయాలంటూ చాలామంది సూచించారు. అయితే ఇదే విషయమై మోడి  సిఎంలకు ఓ ఛాలెంజ్ విసిరినట్లు సమాచారం.

 

అందరూ కోరుకుంటున్నట్లు లాక్ డౌన్ ఎత్తేస్తే వైరస్ వ్యాప్తి నిరోధానికి ఉన్న మార్గాలేమిటి అని ప్రధాని సిఎంలను సూటిగా ప్రశ్నించాడు.  లాక్ డౌన్ ను కేంద్రం ఎత్తేస్తే వైరస్ వ్యాప్తి విషయంలో జనాలను కట్టడి చేయటానికి సిఎంల దగ్గర ఏదేనా ప్లాన్ ఉంటే చెప్పమని అడిగినపుడు ఎవ్వరూ పెద్దగా స్పందించలేదని సమాచారం. లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా జనాలు పడుతున్న ఇబ్బందులు తనకు తెలుసని మోడి స్పష్టం చేశారు. అయితే వైరస్ నియంత్రణకు ఇంతకన్నా మార్గం లేదని కూడా గట్టిగానే చెప్పారు.

 

కరోనా వైరస్ కు మందు లేదు కాబట్టి నివారణ ఒకటే మార్గమన్నారు. నివారణంటే ఇక్కడ లాక్ డౌన్ తప్ప మరో మార్గం లేదని అలాంటి మార్గం ఏదైనా ఉంటే చెప్పమని మోడి అడిగిన ప్రశ్నకు సిఎంలు ఏ సమాధానం చెప్పలేకపోయారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వైరస్ వ్యాప్తిని నియంత్రించటంలో మోడి చెప్పింది కరెక్ట్. అలాగే జనాల ఇబ్బందుల విషయంలో సిఎంలు ప్రస్తావించింది కూడా వాస్తవమే. కానీ ప్రస్తుత సమస్యకు ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. ఈ పరిస్ధితుల్లో మోడి ఏమి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: