తెలంగాణలో కరోనా కేసులు రోజూ కొత్తవి నమోదు అవుతూనే ఉన్నాయి. ఢిల్లీ మ‌ర్క‌జ్ లింకుల‌తో క‌రోనా వ్యాప్తి రాష్ట్రంలోని అన్ని జిల్లాల‌కు పాకేసింది. ఒక్కో జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య ప‌దుల సంఖ్య ఉండ‌టంతో జ‌నాల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వు తోంది. ఇదిలా ఉండ‌గా రాష్ట్ర ప్ర‌భుత్వం హెల్త్ బులిటెన్ నిలిపివేయ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి రెండో దశలో ఉన్న నేపథ్యంలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 150 దాటిపోయింది. దీంతో మ‌రిన్ని క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌ల‌కు కేసీఆర్ ప్ర‌భుత్వం ఆదేశాలిస్తోంది. అన‌వ‌స‌రంగా రోడ్ల‌పైకి వాహ‌నాల‌తో వ‌చ్చేవారిపై ఏమాత్రం క‌నిక‌రం చూప‌కుండా కేసులు బుక్ చేయాల‌ని నిర్ణ‌యించింది. 

 

అంతేకాదు వాహ‌నాల‌ను సీజ్ చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఎపిడ‌మిక్ చ‌ట్టాన్ని అనుస‌రించి రెండేళ్ల పాటు నాన్ బెయిల‌బుల్ జైలు శిక్ష అమ‌లు కానుంది. కొంత‌మంది ఆక‌తాయిలు..నిర్ల‌క్ష్య పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్న వ్య‌క్తుల వ‌ల్ల మొత్తం స‌మాజం ప్ర‌మాదంలో ప‌డే అవ‌కాశం ఉన్నందువ‌ల్లే క‌ఠిన చ‌ర్య‌ల‌కు పూనుకున్న‌ట్లు అధికార వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉండ‌గా లాక్‌డౌన్ ముగిసే నాటికి రాష్ట్రంలో ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డేలా చేయాల‌ని ప్ర‌భుత్వం విశ్వ ప్ర‌య‌త్నం చేస్తోంది. లేదంటే ఆర్థిక సంక్షోభం పొంచి ఉండే ప్ర‌మాద‌ముంద‌న్న సంకేతాలు కూడా ప్ర‌భుత్వం కొన్ని క‌ఠిన ఆంక్ష‌లు తీసుకురావ‌డానికి ప్ర‌ధాన కార‌ణంగా తెలుస్తోంది.

 

వాస్త‌వానికి లాక్‌డౌన్ పొడ‌గింపు చేయాల‌ని అనుకున్న ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌కు ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త రావ‌చ్చు..ఎన్నాళ్లు ప‌ని మానుకుని ఇళ్ల‌లో కూర్చుంటామ‌న్న భావ‌న ఇప్ప‌టికే మ‌ధ్య‌, పేద త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. ఇదే విష‌య‌మైగురువారం సీఎం అధ్యక్షతన ఉన్నతాధికారులతో మరోసారి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా కట్టడి, లాక్ డౌన్, కర్ఫ్యూ అమలు విషయాలపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్, రాష్ట్ర ప్రభుత్వం రాత్రి సమయంలో విధించిన కర్ఫ్యూలను కొన్ని చోట్ల ప్రజలు పట్టించుకోవడం లేద‌ని తెలుసుకున్న సీఎం ఉక్కుపాదం మోపాల‌ని ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: