పిల్లల పెంపకం విషయంలో తల్లి తండ్రులు  చాలా జాగ్రత్తలు వహించాలి.. ఎందుకంటే మొక్కై వంగనిది మానై వంగునా !! అనే సామెత అర్ధం తెలుసా చిన్న వయసులో ఉన్నపుడు మాట వినని వాళ్ళు పెద్దయ్యాక మాట వింటారా అని.పిల్లలు ఏదన్నా అడిగినప్పుడు,అల్లరి చేస్తున్నప్పుడు, మారాం చేస్తున్నప్పుడు అరుస్తూ,కోప్పడుతూ, అనే మాటలు వాళ్ళ సున్నితమైన  మనసుల్ని గాయం చేస్తాయి. అలాగే పిల్లలు ఎమన్నా కావాలని అడిగినపుడు వద్దు అని చెబుతూఉంటాము . మనం చెప్పే అన్ని మాటల్లో ' వద్దు ' అనే సంకేతం పిల్లలకు కనిపిస్తుంది.ఆ సంకేతం పిల్లలకు అస్సలు ఇష్టం ఉండదు; నిగ్రహాన్ని కోల్పోయి, కోప ప్రకోపాలను చూపుతారు.మా అమ్మ నాన్నలు ఏది అడిగిన వద్దు అంటారు, నేనంటే అసలు ఇష్టం లేదు అన్న భావనలో ఉండిపోతారు. 

 

పిల్లల ప్రవర్తనను విశ్లేషించే మానసిక శాస్త్రవేత్తలేమంటారంటే, “తల్లిదండ్రులు వద్దు అనే పదాన్ని వాడుతూంటే, ఆ పదం యొక్క పరమార్ధాన్ని గ్రహించే సున్నితత్వం పిల్లలలో నశించిపోతుంది”  అని. ఆ పదాన్ని పిల్లల విషయంలో ఎంత పొదుపుగా వాడాలంటే ఆ మాట చెప్తే తప్ప పిల్లలు సమస్య నుంచి  బయటపడరు అనుకునే సంధర్బంలోనే,మరొక ప్రత్యామ్నాయ మార్గం లేదనుకున్నప్పుడే వాడాలి.

 

ఇది చదవగానే చాలమంది తల్లితండ్రులు మా పిల్లల సంగతి ఈ రాసిన వాళ్ళకేం తెలుసు, ఒక గడియ పిల్లలతో  గడిపితే తెలుస్తుందని అనుకుంటూండవచ్చు.

 

బయట బజారుకు తీసుకెళ్తే బొమ్మల దగ్గర ఆగిపోతారు,కొనివ్వమని గొడవ చేస్తారు. కిందపడి దొర్లుతారు, పోని కొనిచ్చామా ! దాంతో ఆడుకోరు. మళ్ళీ ఇంకో బొమ్మ,ఇంకో బొమ్మ, ఇలా ఎన్నో బొమ్మలతో ఇల్లు నిండిపోతుంది. మరి వద్దు అనకుండా ఉండటమెలా  ????.. “పెన్సిలు పారేస్తే రేపు మరొకటి కొనిపెట్టను”  అని చెప్పి పంపుతారు, తప్పకుండా పారేసుకొస్తారు. పారేసుకొచ్చాక మళ్ళీ పాతపాటే.కాస్త అటు ఇటుగా ఏ తల్లిదండ్రులను కదిలించినా  చెప్పే  విషయాలివే.

 

పిల్లలమీద కోపంతో చేసేది లేక అరుస్తారు. అయితే తల్లి తండ్రులు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. పిల్లలు  పెద్ద వాళ్ళు లాగా ఎలా ఉండగలరు? ఉండగలిగితే వాళ్ళు పిల్లలు కారు పెద్దలౌతారు...ప్రతి తల్లి తండ్రి పిల్లలు దశ  నుండే పెద్దవాళ్ళు అయ్యారు. వద్దని చెప్పకుండానే పిల్లలలో మంచి అలవాట్లు పెంపొందించడానికి తల్లిదండ్రులు సరయిన  ప్రత్యామ్నాయాలని, పరిష్కారాలను చూపించండి.ఇప్పుడు నువ్వు ఆ పని మానేస్తే నీకు నేను ఐస్ క్రీం,చాక్లెట్లు కొనిస్తాను, పార్కుకు తీసుకెళ్తాను అని చెప్పి చూడండి. చెప్పింది మాత్రం తప్పక చేయండి.

 

ఇంకా, ఐస్ క్రీం కావాలా, చాక్లెట్లు కావాలా, బొమ్మ కావాలా,సినిమాకెళ్ళాలా, పార్కుకెళ్ళాలా అంటూ చాలా ప్రత్యామ్నాయాలను చూపి, ఏం కావాలో కోరుకోమనండి. దాంతో కొంతవరకు అదుపులోకి వస్తారు. అంతే కాని వద్దు అనే పదం వాడకండి.పిల్లలు సాదారణంగా ఉక్రోషాన్ని కోపాన్ని ప్రదర్శించే సందర్భాలు, ఎలాంటి సమయాలలో వీటిని ప్రదర్శిస్తారో మీకు అనుభవం ఉండే ఉంటుంది. సాధారణంగా ఆకలి వేసినపుడు, అలసిపోయినప్పుడు, విసుగు వచ్చినప్పుడు అలా చేస్తుంటారు.. కనుక ముందుగానే జాగ్రత్తపడి ఆకలేస్తే ఇవ్వడానికి తినుబండారాలు, అలసట, విసుగు కలిగినపుడు వారి దృష్టి మళ్ళించే కొత్త ప్రయత్నాలు,మార్గాలు ఆలోచించుకుని సిద్ధంగా ఉండాలి.

 

పిల్లల మీద చెయ్యెత్తడం, కొట్టడం అస్సలు పరిష్కార మార్గాలు కావు..వాళ్ళకు మంచి, చెడు ప్రవర్తన పట్ల వ్యత్యాసం అంతగా తెలియదు. పిల్లలు ఎలా ఉండాలని అందరూ కోరుకుంటారో, పిల్లలు ఎలా ఉంటే అందరూ ఇష్ట పడతారో  పిల్లలకు బోధపరచండి. పిల్లలతో కూర్చుని ఎందుకు చేయకూడదో వివరించండి. అపుడు మీ బిడ్డ కూడా తన భావాలను మీతో పంచుకుంటాడు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: