ప్రపంచంలో క‌రోనా వైర‌స్ బీభ‌త్సం సృష్టిస్తోంది. దాదాపుగా అన్నిదేశాల్లోనూ వైర‌స్ ప్ర‌భావం చూపుతోంది. క‌రోనా, కొవిడ్‌-19 పేర్లు వింటేనే జ‌నం బెంబేలెత్తిపోతున్నారు. ఇక భార‌త్‌లో కూడా క‌రోనా వైర‌స్ ప్ర‌భావం రోజురోజుకూ తీవ్ర‌మ‌వుతోంది. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని మ‌ర్క‌జ్ ఉదంతం త‌ర్వాత ప‌రిస్థితి ఒక్క‌సారిగా మారిపోయింది. ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతోంది. దేశంలో క‌రోనా క‌ట్ట‌డికి కేంద్ర ప్ర‌భుత్వం అనేక చ‌ర్య‌లు తీసుకుంటోంది. ముఖ్యంగా ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించడానికి ప్ర‌య‌త్నం చేస్తోంది. ప్ర‌జ‌లు సోష‌ల్ డిస్టెన్స్ పాటించేలా అప్ర‌మ‌త్తం చేస్తోంది. అలాగే.. వైర‌స్ ప‌ట్ల ప్ర‌జ‌ల్ని ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్తం చేయ‌డానికి,  మ‌న చుట్టుప‌క్క‌ల ఎవ‌రైనా క‌రోనా వైర‌స్ సోకిన వారు ఉన్నారా.. లేరా.. అని తెలుప‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం కొత్త యాప్ *ఆరోగ్య సేతు* అనే యాప్‌ను లాంచ్ చేసింది. ఈ యాప్‌తో ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి.. మ‌న చుట్టుప‌క్క‌ల క‌రోనా వైర‌స్ ప్ర‌భావంపై మ‌న‌ల్ని ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్తం చేస్తుంది. తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లను చెబుతుంది. ఇలా మ‌రెన్నో తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇందులో ఉన్నాయి. 

 

ఈ నేప‌థ్యంలోనే ఆరోగ్య సేతు యాప్‌కు ప్ర‌జ‌ల నుంచి అనూహ్య స్పంద‌న ల‌భిస్తోంది. శుక్ర‌వారం వ‌ర‌కు ఏకంగా 30ల‌క్ష‌ల డౌన్లోడ్స్ కావ‌డం గ‌మ‌నార్హం. ఇక మున్ముందు ఈ సంఖ్య మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం ఉంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇక ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌పంచంలో సుమారు 204 దేశాల్లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందిన‌ట్లు అంత‌ర్జాతీయ మీడియా పేర్కొంటోంది. భారతదేశంలో శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కు  కొవిడ్‌-19 కేసుల సంఖ్య 2,500కు చేరువ‌లో ఉంది. ఇక వైర‌స్‌తో మృతి చెందినవారి సంఖ్య 72. ఇక శుక్ర‌వారం ఉద‌యం ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ దేశాన్ని ఉద్దేశించి చిన్న వీడియాలో విడుద‌ల చేశారు. క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌జ‌లంద‌రూ ఎంతో క్ర‌మ‌శిక్ష‌ణ‌గా ఉంటున్నారంటూ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. క‌రోనా అనే అంధ‌కారాన్ని త‌రిమికొట్ట‌డానికి ఏప్రిల్ 5న రాత్రి 9గంట‌ల‌కు 9 నిమిషాలపాటు అన్ని లైట్లను ఆపివేసి, మన పరిసరాలను కొవ్వొత్తులు, దీపాలు, టార్చ్ లేదా మొబైల్ ఫ్లాష్‌లైట్‌లతో ప్రకాశిద్దామ‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. క‌రోనా మ‌హ‌మ్మారిపై మ‌నం విజ‌యం సాధిస్తామ‌ని, ఇదే స్ఫూర్తిని ఏప్రిల్ 14వ‌ర‌కు కొనసాగించాల‌ని ఆయ‌న కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: