దేశంలో ఆక్వా రంగంలో నెంబర్ 1 ఏ రాష్ట్రమైన ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. దేశంలో దాదాపు 60 శాతం ఆక్వా రాష్ట్రంలోనే సాగవుతుంది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో  దేశమంతా లాక్ డౌన్ కొనసాగుతుంది. రోడ్డు, రైలు, వాయు మార్గాలన్నీ మూసుకుపోయాయి. చేపల, రొయ్యల ఉత్పత్తులను పొరుగు రాష్ట్రాలకు తరలించడానికి వీల్లేని పరిస్థితులు నెలకొన్నాయి. కనీసం పొరుగు జిల్లాలకైనా చేరవేయలేని దుస్థితిని మన రాష్ట్రానికి చెందిన రైతులు ఎదుర్కొంటున్నారు.

 

అయితే ఇలాంటి సమయంలోనే జగన్ ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఆక్వా రైతులని ఆదుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. దళారులకు చెక్ పెట్టేలా రైతులకు మద్దతు ధర కల్పించారు. ఇక ప్రాసెసింగ్ యూనిట్స్‌కి కూలీలు దొరకని నేపథ్యంలో లాక్ డౌన్ వ్యవసాయ, ఆక్వా రంగాలకు మినహాయింపు ఇచ్చారు. అలాగే దళారుల మాటలు నమ్మి తొందరపడి రొయ్యలను అమ్మకానికి పెట్టొద్దని రైతులకు తగు సలహాలు ఇచ్చింది. రొయ్యల విక్రయానికి సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులను సంప్రదించాలని.. తొందరగా నిర్ణయం తీసుకొవద్దని సూచించింది.

 

కానీ ప్రభుత్వం మాటలని దళారులు పట్టించుకోవడం లేదు. కనీస మద్దతు ధర ఇవ్వకుండా రైతులని మోసం చేస్తున్నారు. ఇక ఈ లాక్ డౌన్ సమయంలో రొయ్యలు,చేపల అమ్మకాలు ఆగిపోతే తాము భారీగా నష్టపోతామని భయపడి రైతులు కూడా ఎంత ధర వస్తే అంత ధరకు దళారులకు అమ్మేస్తున్నారు. పైగా రొయ్యలు, చేపలు నిల్వ చేసుకోవడానికి తగినన్ని కోల్డ్ స్టోరేజ్ లు లేకపోవడం వల్ల రైతులకు వేరే మార్గం లేకుండా పోతుంది.

 

ఇక ఇదే విషయంపై వెస్ట్ గోదావరి జిల్లా పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కూడా స్పందించి, ఆక్వా రైతులని ఆదుకోవాలని ప్రభుత్వానికి లేఖ రాసారు. రొయ్యలను ఎండబెట్టుకునే స్థితికి రైతులు వచ్చారని, సీఎం ప్రకటించిన రొయ్యల ధరలకు కింద స్థాయిలో దిక్కులేదన్నారు. ఆక్వా ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, ధరల స్థిరీకరణ నిధి నుంచి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. మొత్తానికైతే దళారులకు చెక్ పెట్టి క్షేత్ర స్థాయిలో ఆక్వా రైతులకు మద్దతు ధర అందేలా చూడాల్సిన బాధ్యత స్థానిక అధికారులపైన ఎంతైనా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: